భారత్ ఎకానమీ అదుర్స్.. కరోనా నుండి కోలుకుంటోంది: ఏ రేటింగ్ ఏజెన్సీ ఎంత అంచనా?
ఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ 2020-21 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 10.6 శాతం నమోదు చేయవచ్చునని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనా వేసింది. సెప్టెంబర్ నెలలో మైనస్ 11.5 శాతం అంచనా వేయగా, నాటి కంటే ఇది కాస్త మెరుగు. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థపై ఈసారి పలు ఏజెన్సీలు కాస్త సానుకూల అంచనాలను ప్రకటిస్తున్నాయి.
కేంద్రప్రభుత్వం ఇటీవల రూ.2.7 లక్షల కోట్లతో ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ 3.0 ప్యాకేజీ నేపథ్యంలో అంచనాలు సవరించినట్టు మూడీస్ గురువారం తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 10.8 శాతంగా నమోదవుతుందని తాజాగా అంచనా వేసింది. సెప్టెంబర్ నెలలో దీనిని 10.6 శాతంగా అంచనా వేసింది.

ఇక్రా సానుకూలం
సెప్టెంబర్, అక్టోబర్ నెలల నుండి ఉత్పత్తి, నిర్మాణ రంగాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. సెప్టెంబర్ 2020తో ముగిసిన రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు పతనం మొదటి త్రైమాసికం (మైనస్ 23.9) ఉన్నంతగా ఉండదని రేటింగ్ సంస్థ ఇక్రా తెలిపింది. కరోనా, లాక్ డౌన్ కారణంగా మొదటి త్రైమాసికంలో భారీగా పతనమైంది. రెండో త్రైమాసికంలో (సెప్టెంబర్) మైనస్ 9.5 శాతానికి మించకపోవచ్చునని తెలిపింది. అన్-లాక్ నేపథ్యంలో మే, జూలై నుండి దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకున్నాయి. లేదంటే వృద్ధి రేటు దారుణంగా పడిపోయేదని పేర్కొంది.

గోల్డ్‌మన్ శాక్స్....
గోల్డ్‌మన్ శాక్స్ గతంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీని మైనస్ 14.8 శాతం అంచనా వేసింది. తాజాగా దానిని 10.3 శాతానికి సవరించింది. మూడీస్ 2020లో వృద్ధి రేటు అంచనాను అంతక్రితం మైనస్ 9.6 శాతంగా అంచనా వేయగా, తాజాగా మైనస్ 8.9 శాతానికి తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ దాదాపు రూ.30 లక్షల కోట్లుగా ఉంది. ఇది స్థూల దేశీయ ఉత్పత్తిలో 15 శాతం. దేశంలో తయారీ రంగంలో పోటీతత్వాన్ని పెంచేందుకు, ఉపాధి కల్పనకు, మౌలిక రంగంలో పెట్టుబడులకు మద్దతునివ్వడానికి కేంద్రం తాజాగా ప్రకటించిన రూ.2.7 లక్షల కోట్ల ఉద్దీపన చర్యలు క్రెడిట్ పాజిటివ్ అని మూడీస్ తెలిపింది. 2021-22లో వృద్ధి సైతం 10.8 శాతానికి సవరించింది.

వివిధ రేటింగ్ ఏజెన్సీలు..
కాగా, వివిధ రేటింగ్ ఏజెన్సీలు భారత ఆర్థిక వ్యవస్థపై పలు అంచనాలు వెల్లడించాయి. కేర్ రేటింగ్ మైనస్ 8.2 శాతం, యూబీఎస్ 8.6 శాతం, ఎస్ అండ్ పీ 9 శాతం, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు 9 శాతం, ఆర్బీఐ 9.5 శాతం, ప్రపంచ బ్యాంకు 9.6 శాతం, ఫిచ్ రేటింగ్స్ 10.5 శాతం, ఎస్బీఐ ఎకోర్యాప్ 10.9 శాతం, ఇక్రా 11 శాతం, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ 11.8 శాతం, ఐఎంఎఫ్ 10.3 శాతంగా అంచనా వేసింది.