భారీ నష్టాలు, రుణభారంతో మహీంద్రా 'శాంగ్‌యాంగ్' దివాలా పిటిషన్
దేశీయ దిగ్గజ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్‌కు చెందిన దక్షిణ కొరియా శాంగ్‌యాంగ్ మోటార్స్(SYMC) దివాలా పిటిషన్ దాఖలు చేసింది. నష్టాలు భారీ రుణభారం కారణంగా దివాలా చట్టం కింద పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియకు అనుమతించాలని సియోల్ దివాలా కోర్టులో దరఖాస్తు చేసినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. పునర్వ్యవస్థీకరణ మద్దతుకు కోర్టు ఆమోదముద్ర వేస్తే, బోర్డు పర్యవేక్షణలో రుణదాతలు తదితరులతో పునరుద్ధరణ ప్యాకేజీపై కంపెనీ చర్చిస్తుందని తెలిపింది. SYMC దాఖలు చేసిన పత్రాలు, దరఖాస్తు ఆధారంగా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు అనుమతించాలా లేదా అనే అంశంపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.
ఐపీవోకు హైదరాబాద్ కేంద్రంగా పని చేసే MTAR: మొత్తం కోటికి పైగా షేర్లు

రెగ్యులేటరీ ఫైలింగ్‌లో...
SYMC సౌత్ కొరియా డెబ్టార్ రిబాబిటిలేషన్ అండ్ బ్యాంక్రప్టసీ చట్టం ప్రకారం సియోల్ దివాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని మహీంద్రా అండ్ మహీంద్రా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అదే సమయంలో ఆటానమస్ రీస్ట్రక్చరింగ్ సపోర్ట్(ARS) ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపింది. ఇది ప్రాసెస్‌లో ఉందని వెల్లడించింది. దాదాపు రూ.408 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉన్నప్పటికీ శాంగ్‌యాంగ్ విఫలమైంది.

ఆ ప్రతిపాదనకు తిరస్కరణ
ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న శాంగ్‌యాంగ్‌ను మహీంద్రా అండ్ మహీంద్రా 2010లో కొనుగోలు చేసింది. లాభాల బాట పట్టించేందుకు పలు ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యపడలేదు. శాంగ్‌యాంగ్‌లో మహీంద్రాకు 75 శాతం వాటా ఉంది. ఇప్పటి వరకు 110 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. 2017 నుంచి నష్టాలు పెరుగుతున్నాయి. వీటితో పాటు రుణభారం రూ.680 కోట్లకు పెరిగింది. మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో శాంగ్‌యాంగ్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను మహీంద్రా అండ్ మహీంద్రా తిరస్కరించింది.

బ్యాంకులకు రుణం
జేపీ మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా బీఎన్‌పీ పరిబాస్ వంటి బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంది. డిసెంబర్ 14వ తేదీ నాటికి రూ.408 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించలేదు. మహీంద్రా అండ్ మహీంద్రా ఈ సంస్థను కొనుగోలు చేసిన పదేళ్లకు దివాలా పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.