ఒక్కసారి డబ్బు చెల్లించి ప్రతినెలా పెన్షన్ కావాలా..? ఎల్ఐసీ అందిస్తున్న సూపర్ స్కీమ్ మీకోసమే..
LIC Saral Pension Scheme: ప్రతి ఒక్కరూ మంచి రిటైర్‌మెంట్ జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. వారు సంపాదించడం మానేసినప్పుడు ఖర్చులను తీర్చడానికి నగదు కొరత ఉండకూడదని భావిస్తుంటారు. అలాంటప్పుడు పెన్షన్ ప్లానింగ్ ఈ విషయంలో చాలా సహాయకారిగా ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత పెన్షన్‌కు సంబంధించి అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ మీరు 40 ఏళ్ల తర్వాత పెన్షన్ పొందడం ఎలా ప్రారంభించాలా అని ఆలోచిస్తున్నారా.
అయితే.. దేశంలోని అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తన కస్టమర్లకు ఇదే విధమైన ప్లాన్‌ను అందిస్తోంది. అదే ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్. LIC సరళ్ పెన్షన్ యోజనలో.. మీరు 40 సంవత్సరాల వయస్సు నుంచి పెన్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ప్లాన్ ఫీచర్లు ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

ఏకమొత్తంలో ఒకేసారి పెట్టుబడి..
LIC సరళ్ పెన్షన్ పథకం అనేది నాన్-లింక్డ్, సింగిల్ ప్రీమియం, వ్యక్తిగత తక్షణ యాన్యుటీ ప్లాన్. మీరు ఈ ప్లాన్‌ని ఒంటరిగా లేదా మీ జీవిత భాగస్వామితో కలిసి తీసుకోవచ్చు. మీరు దానిలో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆపై మీరు పెన్షన్ పొందుతూనే ఉంటారు. ఈ పాలసీని తీసుకునే సమయంలో.. చందాదారుడు ఒకేసారి ప్రీమియం చెల్లించాలి.
పింఛన్ ఎంత మొదలవుతుందో.. అదే పెన్షన్ మెుత్తం జీవితాంతం కొనసాగుతుంది. ఈ పథకానికి కనీస వయస్సు 40 సంవత్సరాల, గరిష్ఠ వయస్సు 80 సంవత్సరాలుగా ఉంది. ఈ పాలసీని ప్రారంభించిన ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా సరెండర్ చేసేందుకు వెసులుబాటు అందుబాటులో ఉంది.

పాలసీని రెండు రకాలుగా తీసుకోవచ్చు..
LIC సరళ్ పెన్షన్ ప్లాన్ సింగిల్ లైఫ్ లేదా జాయింట్ లైఫ్ మోడ్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఒంటరి జీవితంలో పాలసీ ఒక వ్యక్తి పేరు మీద ఉంటుంది. పాలసీదారు తన జీవితాంతం పెన్షన్ పొందుతాడు. పాలసీదారు మరణించిన తర్వాత.. అతని/ఆమె నామినీకి బేస్ ప్రీమియం మొత్తం తిరిగి ఇవ్వబడుతుంది. మరోవైపు.. జాయింట్ పాలసీ కింద భర్త, భార్య ఇద్దరూ కలిసి పెన్షన్ తీసుకోవచ్చు.
ప్రాథమిక పింఛనుదారులు జీవించి ఉన్నంత కాలం వారు పెన్షన్ పొందుతూనే ఉంటారు. అతను చనిపోయినప్పుడు.. బతికి ఉన్న అతని జీవిత భాగస్వామికి పెన్షన్ వస్తుంది. చివరికి జీవిత భాగస్వామి మరణించిన తర్వాత.. నామినీకి బేస్ ప్రీమియం చెల్లించటం జరుగుతుంది.

పెన్షన్ పొందడానికి నాలుగు ఆప్షన్లు..
ఎల్‌ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్‌లో పెన్షన్ పొందడానికి నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. కస్టమర్లు నెలవారీ, క్వార్టర్లీ, అర్ధ సంవత్సరం లేదా వార్షిక పెన్షన్ తీసుకోవచ్చు. నెలవారీ పెన్షన్ కనీసం రూ. 1000, త్రైమాసిక పింఛను కనిష్ఠంగా రూ. 3,000, అర్ధ సంవత్సరానికి కనిష్ఠంగా రూ. 6,000, వార్షిక పెన్షన్ కనీసం రూ. 12,000గా ఉంది.
అయితే.. గరిష్ఠ పెన్షన్ మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు. ఉదాహరణకు.. మీ వయస్సు 42 సంవత్సరాల, మీరు రూ. 30 లక్షల యాన్యుటీని కొనుగోలు చేసినట్లయితే.. మీకు నెలవారీ పెన్షన్ రూ.12,388 లభిస్తుంది.

లోన్ ఆప్షన్ కూడా ఉంది..
ఈ పథకంలో పాలసీదారులకు రుణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. పథకం ప్రారంభమైన ఆరు నెలల తర్వాత కస్టమర్లు లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదే సమయంలో.. మీకు ఏదైనా వ్యాధి చికిత్స కోసం డబ్బు అవసరమైతే, మీరు పాలసీలో డిపాజిట్ చేసిన డబ్బును కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. పాలసీని సరెండర్ చేసిన తర్వాత, కస్టమర్ బేస్ ధరలో 95 శాతం తిరిగి పొందుతారు.