Union Budget 2022: నిర్మలమ్మ బడ్జెట్‌తో ఈ రెండు స్టాక్స్ లాభాల్లో పయనిస్తాయా..?
ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సారి బడ్జెట్ అంచనాలపై కామన్ మ్యాన్ నుంచి కార్పొరేట్స్ వరకు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఎలాంటి మినహాయింపులు దక్కుతాయా అంటూ ఎదురుచూస్తున్నారు. నిర్మలమ్మ ఏమేరకు కరుణిస్తుందో వేచిచూస్తున్నారు. ఇక బడ్జెట్ కేటాయింపుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం ఎప్పుడూ కీలకంగా వ్యవహరిస్తుంది. దేశ అభివృద్ధికి మౌలిక సదుపాయాలు ఒక సూచీగా వ్యవహరిస్తాయి. ఇక ఈ మౌలిక సదుపాయాల రంగంలో రహదారులు, వంతెనలు, పోర్టులు, డ్యామ్‌లు, ఎయిర్‌పోర్టులకు కేటాయింపులు తప్పనిసరిగా ఉంటాయి. ఇక బడ్జెట్ కేటాయింపులను అనుసరించి చూస్తే ఈ సారి 2022-23 బడ్జెట్‌లో రెండు స్టాక్స్ బాగా లాభాలు పొందే అవకాశాలున్నాయంటూ నిపుణులు చెబుతున్నారు.
ముందుగా L&T:
దేశంలో ఆపరేట్ అవుతున్న అతిపెద్ద మౌలికసదుపాయాల కంపెనీల్లో L&T ఒకటి. నిర్మాణ రంగం నుంచి ఇంజినీరింగ్ వరకు ఇలా అన్నిటిలో ఈ కంపెనీ పనిచేస్తోంది. ఇక మౌలికసదుపాయాల రంగంలో బడ్జెట్ కేటాయింపులు పెరిగితే లాభాలు బాట పట్టే కంపెనీల్లో L&T సంస్థ ముందువరసలో నిలుస్తుంది. ఎందుకంటే ఇది అన్ని రంగాల్లో సేవలందిస్తోన్న కంపెనీ కనుక ఇందులో కచ్చితంగా లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ కంపెనీకి విదేశాల నుంచి కూడా భారీ కాంట్రాక్టులు దక్కాయి. అయితే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత నిపుణులు L&T స్టాక్ లాభాల బాట పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం స్టాక్‌ను కొనుగోలు చేయాలా లేదా అమ్మాలా అనేది మాత్రం చెప్పడం లేదు. L&T స్టాక్ గత ఏడాదిలో క్రమంగా పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో మార్కెట్లు కూడా పెరిగాయి.

రెండవ స్టాక్ దిలీప్ బిల్డ్‌కాన్:
ఇన్‌ఫ్రా స్పేస్‌లో మరో స్టాక్ కీలకంగా వ్యవహరిస్తోంది. అదే దిలీప్ బిల్డ్‌కాన్ సంస్థకు చెందిన స్టాక్. భారత్‌లో శరవేగంగా వృద్ధి చెందుతున్న రోడ్ కంపెనీ. రహదారులకు కూడా కేటాయింపులు బాగానే ఉంటాయి. ఈ సారి కూడా రహదారులకు నిర్మలమ్మ బడ్జెట్‌లో కేటాయింపులు కాస్త పెరిగే అవకాశాలున్నాయి. అయితే ఈ మధ్యే ఈ కంపెనీ ఎక్స్‌ఛేంజ్ ఫైలింగ్‌లో ఓ ప్రకటన చేసింది. సంస్థ సీబీఐ కేసు ఒకటి ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగా ఈ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను విచారణ చేస్తోంది. ఇప్పుడు ఆ విచారణ పూర్తయి సీబీఐ కంపెనీ ఈడీని కస్టడీ నుంచి విడుదల చేసిందని పేర్కొంది. విచారణ సమయంలో విచారణాధికారులకు కంపెనీ పూర్తిగా సహకరించిందని వెల్లడించింది. ఈ మధ్యనే ఈ కంపెనీకి చెందిన షేర్లు పడిపోయాయి. అయితే ఈ స్టాక్స్ కూడా కొనుగోలు చేయాలని చెప్పడం లేదు కానీ... బడ్జెట్ నుంచి లబ్ది పొందే కంపెనీల్లో ఈ కంపెనీ కూడా ఒకటిగా నిలుస్తుందని మాత్రమే చెబుతున్నామని విశ్లేషకులు వెల్లడించారు.