For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశ ఆర్థిక వ్యవస్థను హెలికాప్టర్ మనీ, క్యూఈ గట్టెక్కిస్తాయా? అసలేమిటివి?

|

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం మన దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. లాక్‌డౌన్ కారణంగా పరిశ్రమలు మూతపడ్డాయి. వస్తు, సేవల ఉత్పత్తి ఆగిపోయింది. ఇది ఈ ఆర్థిక సంవత్సరంలో మన దేశ జీడీపీపై కూడా ప్రభావం చూపుతుందని, దీంతో దేశ జీడీపీ వృద్ధి రేటు 1.5 శాతం నుంచి 2.8 శాతం మాత్రమే పెరగొచ్చని ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తోంది.

ఈ నేపథ్యంలో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ఇతర చర్యలు, అలాగే లాక్‌డౌన్ విషయంలో ఒక క్లారిటీకి వచ్చేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు హెలీకాప్టర్ మనీ, క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానాలు చేపట్టాలంటూ ప్రధాని మోడీకి సూచించారు.

దీంతో హెలీకాప్టర్ మనీ, క్వాంటిటేటివ్ ఈజింగ్ ఆర్థిక విధానాలు అనే మాటలు తెరపైకి వచ్చాయి. అసలేమిటివి? ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఇవి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కిస్తాయా? అన్న ప్రశ్నలు అందరి మనసుల్లో ఉదయించాయి. దీనిపై కొంత క్లారిటీ ఇస్తుంది ఈ ప్రత్యేక కథనం.. చదవండి!

హెలికాప్టర్ మనీ అంటే?

హెలికాప్టర్ మనీ అంటే?

ఎన్నో అవసరాలు డబ్బుతో తీరుతాయి. అయితే అలాంటి డబ్బు ఎవరికీ అంత ఈజీగా లభించదు. ఇక కట్టల కొద్దీ డబ్బు అనేది చాలామందికి ఒక కల మాత్రమే. ఒక్కోసారి.. ‘అబ్బ.. ఎవరైనా ఆకాశం నుంచి డబ్బుల వర్షం కురిపిస్తే ఎంత బాగుండు..' అని, లేదంటే.. ‘ఈ చెట్టుకు రోజూ ఆకుల బదులు కరెన్సీ నోట్లు కాస్తే ఎంత బాగుండు..' అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. ఈ ‘హెలికాప్టర్ మనీ' అంటే కూడా దాదాపుగా ఇలాంటిదే. అంటే.. ఉచితంగా వచ్చే డబ్బు అన్నమాట. ఇంకా వివరంగా చెప్పాలంటే.. కష్టమైన, క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభుత్వాలే ఉచితంగా ప్రజలకు డబ్బు పంచడం.

ఆర్థిక మాంద్యం సమయంలో...

ఆర్థిక మాంద్యం సమయంలో...

ఏ దేశంలోనైనా ఆర్థిక మాంద్యం తీవ్రస్థాయికి చేరినప్పుడు, ప్రజల వద్ద డబ్బులు లేక కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయిన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం ఇటువంటి విధానాలు అవలంభిస్తుంది. ప్రజలకు ఉచితంగా డబ్బులు ఇచ్చి కొనుగోలు శక్తిని పెంచడానికి ప్రయత్నిస్తుంది. డిమాండ్, సప్లైలను పెంచేందుకు ఈ ‘హెలికాప్టర్ మనీ' విధానం దోహదపడుతుంది. 1969లో అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆర్థిక వేత్త ఫ్రెడ్‌మ్యాన్ ఈ హెలీకాప్టర్ మనీ విధానాన్ని ప్రతిపాదించగా, 2002లో ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ బెర్నాంకే దీనిని మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ‘క్వాంటిటేటివ్ ఈజింగ్' విధానంలో కేంద్ర బ్యాంకు ప్రభుత్వం నుంచి బాండ్లు కొనుగోలు చేస్తుంది. దీని కింద పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లను ముంద్రించి చెలామణీ చేయాల్సి ఉంటుంది.

కేంద్ర బ్యాంకుదే కీలక పాత్ర...

కేంద్ర బ్యాంకుదే కీలక పాత్ర...

ఈ హెలీకాప్టర్ మనీ, క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానాల్లో ఆయా దేశాల్లోని నోట్లు ముద్రించే కేంద్ర బ్యాంకుదే ప్రధాన పాత్ర. అంటే.. మన దేశం విషయానికొస్తే.. మన కేంద్ర బ్యాంకు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ). దీని ప్రకారం.. మన ఆర్‌బీఐ నోట్ల ముద్రణను బాగా పెంచి పెద్ద ఎత్తున నగదును ఆర్థిక వ్యవస్థలో చెలామణీలోకి తీసుకొస్తుందన్న మాట. సాధారణంగా అయితే ఆర్‌బీఐ ఎప్పుడూ ఇలా చేయదు. ఎందుకంటే.. వస్తు, సేవల ఉత్పత్తి ఆధారంగానే ఆర్‌బీఐ కరెన్సీ నోట్లను ముద్రించి చలామణీలోకి తెస్తూ ఉంటుంది. ఒకవేళ కరెన్సీ నోట్లను విపరీతంగా ముద్రించి మార్కెట్‌లోకి వదిలితే కొన్నాళ్లకు కరెన్సీ విలువే పడిపోయే ప్రమాదం ఉంటుంది. మరోవైపు ద్రవ్యోల్బణం కూడా విపరీతంగా పెరిగిపోవచ్చు. అందుకే దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆర్థిక మాంద్యం, మందగమనం ఎదుర్కొనే పరిస్థితుల్లో మాత్రమే ఇలాంటి విధానాలు అవలంభిస్తారు.

ఎప్పుడైనా, ఎక్కడైనా అవలంభించారా?

ఎప్పుడైనా, ఎక్కడైనా అవలంభించారా?

గతంలో ఈ తరహా విధానాలను అమెరికా, జపాన్ వంటి దేశాలు అవలంబించాయి. 1918లో ప్రపంచంలో స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు కూడా కొన్ని దేశాలు ఇలాంటి విధానాలను అవలంభించాయి. 2008లో ప్రపంచం ఆర్థిక మాంద్యంలో పడిపోయినప్పుడు కూడా ఈ పద్ధతులు ఉపయోగించారు. అమెరికాలో ఆర్థిక మాంద్యం తీవ్రమైన పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వం ‘హెలీకాప్టర్ మనీ' విధానాన్ని అమలు చేసింది. పెద్ద ఎత్తున కరెన్సీని ముద్రించి ఆర్థిక వ్యవస్థలో చెలామణీలోకి తీసుకొచ్చింది. అలాగే 2016లో జపాన్ కూడా ఈ విధానాన్ని అవలంభించింది.

తెలంగాణ సీఎం చెప్పింది ఇదే...

తెలంగాణ సీఎం చెప్పింది ఇదే...

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా అన్నీ స్తంభించిపోయాయి. ఈ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అటు కేంద్రం వద్దగాని, ఇటు రాష్ట్రాల ఖజానాల్లోగాని సరిపడా నిధులు ఉండవు. ఇలాంటి పరిస్థితిలో కేంద్రమే రాష్ట్రాలకు నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. గతంలో పలు దేశాలు అమలు చేసిన ‘హెలికాప్టర్ మనీ', ‘క్వాంటిటేటివ్ ఈజింగ్' విధానాలను భారత్‌లోనూ అమలు చేయాలి. ఇదే ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఏకైకా మార్గం అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానికి సూచించారు. ఆయనే కాకుండా మరో ఇద్దరు ముగ్గురు సీఎంలు కూడా ఈ విధానం గురించి ప్రధానితో ప్రస్తావించినట్లు సమాచారం.

ఆ బ్యాంకులు చేసిందీ ఇదే...

ఆ బ్యాంకులు చేసిందీ ఇదే...

ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లోంచి బయటపడేందుకు దేశ జీడీపీలో కొంత శాతాన్ని ఆర్‌బీఐ కేటాయిస్తుంది. ఆ నిధుల ద్వారా ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తారు. ఈ తరహా విధానాన్ని ఇప్పటికే అమెరికా ఫెడరల్ బ్యాంకు ప్రకటించింది. ఆ దేశ జీడీపీలో 10 శాతం.. అంటే 2 ట్రిలియన్ డాలర్లను ప్రకటించింది. ఇక బ్యాంక్ ఆఫ్ లండన్ కూడా ఇంగ్లాండ్ జీడీపీలో 15 శాతం కేటాయించింది. మన దేశంలోనూ ఆర్‌బీఐ నుంచి డబ్బు తీసుకోవడం తప్ప ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో మారో మార్గం లేదు.. తెలంగాణ సీఎం చెప్పింది కూడా ఇదే! మన దేశ జీడీపీ దాదాపు రూ.203 లక్షల కోట్లు. ఇందులో 5 శాతం క్వాంటిటేటివ్ ఈజింగ్ కింద తీస్తే.. రూ.10 లక్షల కోట్ల డబ్బు మనకు వస్తుంది. దాన్ని వివిధ రూపాల్లో వెచ్చించి వివిధ రంగాల వారికి ఊరట కలిగించవచ్చు.

English summary

Is helicopter money, quantitative easing will bring out our country from economic crisis

As the lockdown adversely impacting the State’s economy, the Telangana Government has asked the Reserve Bank of India (RBI) to go for ‘helicopter money’ and ‘quantitative easing’ to improve money circulation in the system and boost economy.
Company Search