IPL 2023: రూ.50,000 కోట్లు గుమ్మరించనున్న కార్పొరేట్ కంపెనీలు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా క్రికెట్ టోర్నమెంట్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్.. మరోమారు ఇ-ఆక్షన్ నిర్వహించబోతోంది. ఇదివరకు ప్లేయర్లను ఎంపిక చేసుకోవడానికి బీసీసీఐ బెంగళూరు వేదికగా ఈ వేలంపాటను ముగించుకుంది. ఈ సారి మ్యాచ్‌ల ప్రసార హక్కుల కోసం దీన్ని ఏర్పాటు చేయనుంది. వచ్చే అయిదు సంవత్సరాలకు ఉద్దేశించిన మీడియా రైట్స్ ఇవి.

ఉదయం 11 గంటలకు..
ఈ ఆదివారం ముంబై వేదికగా దీన్ని నిర్వహించడానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటలకు ఇది బిడ్డింగ్స్ ఓపెన్ అవుతాయి. మీడియా ప్రసార హక్కుల కోసం బీసీసీఐ ఇ-వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి. ఆన్‌లైన్ ద్వారా సాగుతుందీ ప్రోగ్రామ్. దీనికి తుదిగడువు అనేది ఏదీ లేదు. బిడ్స్ కోటా పూర్తయ్యేంత వరకూ ఎవరైనా వాటిని దాఖలు చేయవచ్చు.

2027 వరకు..
వచ్చే సంవత్సరం ఐపీఎల్ టోర్నమెంట్ మ్యాచ్‌లను ప్రసారం చేయడంతో.. ఈ మీడియా హక్కుల సైకిల్ ఆరంభమౌతుంది. అయిదు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అంటే 2027లో ఈ హక్కులు ముగుస్తాయి. అనంతరం మళ్లీ కొత్తగా బిడ్డింగ్స్‌ను ఆహ్వానిస్తుంది బీసీసీఐ. 2028 నుంచి మరో అయిదేళ్ల పాటు మనుగడలో ఉండేలా అప్పటి మీడియా రైట్స్ సైకిల్ ఉంటుంది.

మొత్తం నాలుగు ప్యాకేజీలుగా
మీడియా ప్రసార హక్కుల ఇ-వేలంపాటలను మొత్తం నాలుగు ప్యాకేజీలుగా విభజించింది బీసీసీఐ. ఏ, బీ, సీ, డీగా వర్గీకరించింది. ప్యాకేజీ-ఏలో.. ఐపీఎల్ మ్యాచ్‌లను భారత ఉపఖండంలో మాత్రమే ప్రసారం చేయడం, ప్యాకేజీ-బీలో.. డిజిటల్ హక్కులను మాత్రమే పొందడం, భారత ఉపఖండంలో మాత్రమే మ్యాచ్‌లను టెలికాస్ట్ చేయడం.

ప్లేఆఫ్స్.. స్పెషల్ మ్యాచ్ కోసం..
ప్యాకేజీ-సీలో.. ప్లేఆఫ్స్ కూడా కలుపుకొని కొన్ని ప్రత్యేకమైన మ్యాచ్‌లను మాత్రమే ప్రసారం చేయడానికి అవసరమైన డిజిటల్ హక్కులను ఇందులో పొందుపరిచింది బీసీసీఐ. వాటిని భారత ఉపఖండంలో టెలికాస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్యాకేజీ-డీలో.. భారత ఉపఖండం మినహాయించి ప్రపంచం మొత్తం టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద ఐపీఎల్ మ్యాచ్‌లను టెలికాస్ట్ చేయడం.

రేసులో కార్పొరేట్ దిగ్గజాలు..
ఈ హక్కులను పొందడానికి కొన్ని కార్పొరేట్ దిగ్గజాలు రేసులో నిల్చున్నాయి. డిస్నీస్టార్, రిలయన్స్ వయాకామ్ 18, సోనీ నెట్‌వర్క్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి బిగ్ షాట్స్ బిడ్డింగ్స్‌ను దాఖలు చేయనున్నాయి. వాటితో పాటు టైమ్స్ ఇంటర్నెట్, రిలయన్స్ జియో కూడా పోటీలో ఉన్నాయి. డిజిటల్ హక్కుల కోసం మాత్రమే టైమ్స్ ఇంటర్నెట్, రిలయన్స్ జియో బిడ్డింగ్స్ వేయనున్నాయి. సూపర్ స్పోర్ట్ ఇంటర్నేషనల్ టెర్రిటరీ హక్కుల కోసం బిడ్డింగ్స్ వేయనుంది.

బీసీసీఐకి వచ్చే ఆదాయం..
ప్రస్తుతం ఈ మీడియా ప్రసార హక్కులు స్టార్ చేతిలో ఉన్నాయి. 2017లో 16,347 కోట్ల రూపాయలతో దీన్ని దక్కించుకుందా నెట్‌వర్క్. ఈ సారి రెట్టింపు ఆదాయాన్ని ఆశిస్తోంది బీసీసీఐ. ఈ ఇ-ఆక్షన్ బేస్ ప్రైస్ మొత్తమే 32,890 కోట్ల రూపాయలుగా నిర్ధారించింది. కనీసం 35,000 నుంచి 45,000 కోట్ల రూపాయల వరకు వెళ్లొచ్చనే అంచనాలు ఉన్నాయి. 50,000 కోట్ల రూపాయలకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుున్నాయి.