ప్రభుత్వ చర్యల ఫలితం, దేశంలోకి FDIలు 81% జంప్
భారత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ 2020 నవంబర్ నెలలో 81 శాతం జంప్ చేశాయి. ఈ మేరకు కామర్స్ మినిస్ట్రీ డేటా వెల్లడించింది. 2019 నవంబర్ నెలలో 5.6 బిలియన్ డాలర్లుగా ఉండగా, గత ఏడాది అదే నెలలో 10.15 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఎఫ్‌డీఐ ఈక్విటీ కూడా 2.8 బిలియన్ డాలర్ల నుండి 8.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. దీని వృద్ధి 70 శాతంగా నమోదయింది. కరోనా కారణంగా గత ఏడాది ప్రపంచ దేశాల్లోకి పెట్టుబడులు తగ్గిన విషయం తెలిసిందే. అయితే భారత్, చైనాలోకి మాత్రం ఆశాజనకంగా ఉన్నాయి.
ప్రపంచంలోనే భారత్, చైనా అదుర్స్, మన పెట్టుబడులు మాత్రం డౌన్

ఇదే అత్యధికం
ఏప్రిల్-నవంబర్ 2020 కాలంలో భారత్‌లోకి 58.37 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఏ ఆర్థిక సంవత్సరంలో అయినా మొదటి ఎనిమిది నెలల కాలానికి ఇది గరిష్టం. 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల కాలంతో (47.67 బిలియన్ డాలర్లు) పోలిస్తే 22 శాతం అధికం. FDI ఈక్విటీ ఇన్‌ఫ్లో 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ కాలంలో 43.85 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది కూడా ఏ ఆర్థిక సంవత్సరానికైనా ఎక్కువ. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో (32.11 బిలియన్ డాలర్లు) పోలిస్తే 37 శాతం అధికం.

FDI ప్రవాహం
ఆర్థిక వృద్ధిలో FDIలది కీలక పాత్ర. భారత ఆర్థిక అభివృద్ధికి రుణేతర ఫైనాన్స్ ముఖ్య వనరు. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానం అమల్లోకి తీసుకు రావడం కలిసి వచ్చింది. FDI పాలసీని పెట్టుబడిదారులకు మరింత స్నేహపూర్వకంగా మార్చడం, దేశంలోకి పెట్టుబడుల ప్రవాహానికి ఆటంకం కలిగించే పాలసీల అడ్డంకులను తొలగించడం కీలకం. ఈ దిశలో మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించాయని అంటున్నారు. దీంతో దేశంలోకి FDIల ప్రవాహం కొనసాగుతోంది.

భారత్, చైనాల్లోకి..
కరోనా సంక్షోభ సమయంలో భారత్‌లోకి భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) వచ్చిన విషయం తెలిసిందే. 2020 క్యాలెండర్ ఏడాదిలో ఇవి 13 శాతం ఎగిశాయి. మహమ్మారి సమయంలో దాదాపు అన్ని దేశాలకు FDIలు క్షీణించాయి. కానీ భారత్‌తో పాటు చైనాలోకి పెద్ద ఎత్తున వచ్చాయని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (UNCTAD) నివేదిక తెలిపింది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లోకి అత్యంత కనిష్టానికి చేరినట్లు పేర్కొంది.