India GDP: దేశ వృద్ధిపై ధరల పంజా.. అంచనాలను తలకిందులు చేసిన Q2 జీడీపీ..
India GDP: ప్రపంచ ఆర్థిక మందగమనం డిమాండ్ పై ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. అది క్రమంగా భారత ఆర్థిక వ్యవస్థపై కూడా పడింది. తాజాగా సెప్టెంబరుతో ముగిసిన రెండవ త్రైమాసిక జీడీపీ అంకెలు ఇదే సూచిస్తున్నాయి. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వృద్ధి పేలవంగా 6.3 శాతానికి పడిపోయింది.
గత త్రైమాసికంలో భారత జీడీపీ 13.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే ద్రవ్యోల్బణాన్ని నిలువరించేందుకు భారత సెంట్రల్ బ్యాంక్ క్రమంగా వడ్డీ రేట్లు పెంచటంతో దూకుడు పెంచిన తరుణంలో మార్కెట్లో డిమాండ్ భారీగా దెబ్బతింది. కంపెనీలకు సైతం వడ్డీ రేట్ల సెగ తగలటంతో వడ్డీ రేట్ల పెంపును నెమ్మదింప చేయాలని ఇప్పటికే వ్యాపార వర్గాలు విజ్ఞప్తి చేశాయి.

గత ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ మధ్య త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి 8.4 శాతంగా ఉంది. రిజర్వు బ్యాంక్ వరుసగా వడ్డీ రేట్లను పెంచటంతో ఆర్థిక నిపుణులు రెండవ త్రైమాసికంలో వృద్ధి 6.2 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. అయితే వారి అంచనాలకంటే కొంచెం మెరుగ్గా 6.3 శాతంగా నమోదైంది.
ప్రభుత్వం రోడ్ల నుంచి రైల్వేల వరకు మౌలిక సదుపాయాలపై వ్యయాన్ని పెంచడంతో కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం 40% పైగా పెరిగింది. కీలక రంగాల్లో వ్యవసాయోత్పత్తి 4.6% పెరగ్గా.. తయారీ రంగం 4.3%, ఉపాధి కల్పించే నిర్మాణ రంగం 6.6% వార్షిక పెరుగుదలను నమోదు చేశాయి.