ఏప్రిల్ 1 నుండి PLI స్కీం: 40,000 మందికి ఉపాధి, రూ.17,000 ఆదాయం
న్యూఢిల్లీ: టెలికం ఉత్పత్తుల కోసం రూ.12,000 కోట్ల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ (PLI) నిబంధనలకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. స్థానికంగా తయారీని ప్రోత్సహించేందుకు రూ.12,195 కోట్ల విలువైన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహాకాల-PLI పథకానికి ఆమోదం తెలిపింది. PLI పథకం ద్వారా దేశీయంగా రూ లక్షల కోట్ల విలువైన టెలికం పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా నలభై వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. టెలికాం గేర్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి PLI పథకం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుందని కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ చెప్పారు.
మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్, ఏప్రిల్ నుండి టారిఫ్ పెంపు?

రూ.2,44,200 కోట్ల విలువైన ఉత్పత్తులు
PLI పథకం ద్వారా రానున్న అయిదేళ్లలో రూ.2,44,200 కోట్ల విలువైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయవచ్చని భావిస్తున్నట్లు రవిశంకర ప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా రూ.1,95,360 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతులు చేసే అవకాశముందన్నారు. రూ.50,000 కోట్ల దిగుమతులు తగ్గించుకోవచ్చు. ప్రభుత్వానికి రూ.17,000 కోట్ల పన్ను ఆదాయం వస్తుందన్నారు.
పెట్టుబడుల రూపంలో రూ.3000 కోట్లకు పైగా వస్తాయని అంచనా. సులభతర వాణిజ్యానికి సానుకూల వాతావరణం సృష్టించడంతో పాటు అంతర్జాతీయ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. టెలికం పరికరాల విభాగంతో పాటు 5G పరికరాల తయారీలో మేకిన్ ఇండియాను మరింతగా ప్రోత్సహించేందుకు PLI స్కీం ఎంతో ఉపయోగపడుతుంది.

త్వరలో పీఎల్ఐ కిందకు ఇవి..
త్వరలో ల్యాప్‌ట్యాప్, ఐప్యాడ్, ట్యాబ్లెట్ పీసీల ఉత్పత్తులకు కూడా PLI పథకాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. పొరుగుదేశంలోని 14 ఫ్యాక్టరీలను భారత్‌కు తీసుకొస్తున్నట్లు చైనాను ఉద్దేశించి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 2014లో దేశంలో మొత్తం ఎలక్ట్రానిక్స్ తయారీ విలువ రూ.1.9 లక్షల కోట్లు కాగా, 2019-20 నాటికి రూ.5.5 లక్షల కోట్లకు పెరిగిందన్నారు.

ఈ పథకం ఎలా?
PLI పథకం కిందకు రావాలంటే ఎమ్మెస్సెమ్మెస్‌లకు కనీస పెట్టుబడి పరిమితి రూ.10 కోట్లు కాగా, ఇతర కంపెనీలకు రూ.100 కోట్లు. ఈ పథకానికి అర్హత సాధిస్తే పెట్టుబడిదారులకు కనీస పెట్టుబడిపై ఇరవై రెట్లకు పైగా ప్రోత్సాహకాలు దక్కుతాయి. ప్రోత్సాహకాలు నాలుగు శాతం నుండి ఏడు శాతం మేర ఉంటాయి. దీనిని ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తారు.