గోధుమ ఎగుమతులపై నిషేధం, అక్కడ ధరలు జంప్, ఇక్కడ కనిష్టానికి
దేశంలో గోధుమ ధరలు పెరగడంతో ప్రభుత్వం తాత్కాలికంగా వీటి ఎగుమతులను ఇటీవల నిలిపివేసింది. అంతర్జాతీయ మార్కెట్ సోమవారం ఓపెన్ అయినప్పుడు గోధుమ ధరలు దాదాపు ఆరు శాతం మేర పెరిగాయి. అయితే స్థానికంగా వివిధ రాష్ట్రాల్లో వీటి ధరలు మాత్రం నాలుగు శాతం నుండి ఎనిమిది శాతం తగ్గాయి. రాజస్థాన్‌లో క్వింటాల్‌కు రూ.200 నుండి రూ.250, పంజాబ్‌లో రూ.100 నుండి రూ.150కి, ఉత్తర ప్రదేశ్‌లో క్వింటాల్‌కు రూ.100 వరకు తగ్గింది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అక్కడి నుండి గోధుమ ఎగుమతులపై ప్రభావం పడింది.
2022 క్యాలెండర్ ఏడాదిలో గోధమ ధరలు 60 శాతం పెరిగాయి. కేవలం రష్యా, ఉక్రెయిన్ దేశాల నుండే ప్రపంచానికి మూడింట రెండొంతుల గోధుమలు ఎగుమతి అవుతున్నాయి. కానీ ఇప్పుడు యుద్ధం కారణంగా ఎగుమతులు లేవు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగాయి. ఇటీవల భారత్ గోధుమ ఎగుమతులపై నిషేధం విధించడంతో అంతర్జాతీయ మార్కెట్‌పై 5 శాతం ప్రభావం పడింది.

చికాగోలో 5.9 శాతం పెరిగి 12.47 డాలర్లకు చేరుకుంది. భారత్ నిషేధానికి ముందు ధర 11.77 డాలర్లుగా ఉంది. డేటా ప్రకారం భారత్ ఏప్రిల్ 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు అంటే గత ఆర్థిక సంవత్సరం 11 నెలల కాలంలో 66.41 లక్షల టన్నుల గోధుమలు ఎగుమతి చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 21.55 లక్షల టన్నులు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 72.15 లక్షల టన్నుల గోధుమలు ఎగుమతి అయ్యాయి.
గోధుమల ఎగుమతులపై నిషేధం నేపథ్యంలో ధరలు 2016-17 కనిష్టానికి పడిపోయాయి. అంతేకాదు, గత పదమూడేళ్లలో ఇది రెండో కనిష్టం. సీపీఐ ద్రవ్యోల్భణం భారీగా పెరగడంతో గోధుమ ఎగుమతులపై ప్రభుత్వం నిషేధించవలసి వచ్చింది. ద్రవ్యోల్భణం 7.79 శాతంతో ఎనిమిదేళ్ల గరిష్టానికి, ఆహార ద్రవ్యోల్భణం 8.38 శాతానికి చేరుకుంది.