వరుసగా రెండోసారి కరెంట్ అకౌంట్ సర్‌ప్లస్, ఎందుకంటే: తాత్కాలికమేనా...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్‌లో భారత కరెంట్ ఖాతా మిగులు 19.8 బిలియన్ డాలర్లు (రూ.1.45 లక్షల కోట్లకుపైగా) లేదా దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.9 శాతంగా నమోదయినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెలిపింది. దిగుమతులు తగ్గి, వాణిజ్యలోటు 10 బిలియన్ డాలర్లకు చేరడం ఇందుకు ఉపకరించింది. మార్చి క్వార్టర్‌లో కరెంట్ ఖాతా మిగులు జీడీపీలో 0.6 బిలియన్ డాలర్లు లేదా 0.1 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు 15 బిలియన్ డాలర్లు లేదా 2.1 శాతంగా నమోదయింది.
ఆ క్వార్టర్ తుడిచి పెట్టుకుపోయింది, బిజినెస్ అజెండాను అదే నిర్ణయిస్తుంది: HCL రోష్నీ

30 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం
2020-21 ఆర్థిక సంవత్సర తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో దేశ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ దాదాపు 20 బిలియన్ డాలర్లకు చేరుకోవడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశీయ కరెంట్ బ్యాలెన్స్ సర్‌ప్లస్ 30 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా.
అయితే ఈ పెరుగుదల తాత్కాలికమేనని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన నివేదికలో తెలిపింది. ప్రధానంగా కరోనా సంక్షోభం నేపథ్యంలో వాణిజ్య దిగుమతులు తగ్గడంతో దేశ వాణిజ్య లోటు పది బిలియన్ డాలర్ల మేర దిగి రావడం కరెంట్ ఖాతా మిగులుకు కారణం. వరుసగా రెండో క్వార్టర్‌లో కరెంట్ ఖాతా మిగులు ఉండటం ఇది రెండోసారి. అంతేకాదు, ఇది అత్యధికం కూడా.

తగ్గిన రెమిటెన్స్
2020 ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో అంతకుముందు ఏడాదితో పోలిస్తే.. ప్రయివేటు ట్రాన్సుఫర్ రిసిప్ట్స్ ప్రధానంగా రిమెటెన్స్ 8.7 శాతం క్షీణించాయి. నెట్ ఎఫ్‌డీఐ ఔట్ ఫ్లో 0.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతకుముందు ఇదే త్రైమాసికంలో 14 బిలియన్ డాలర్ల ఇన్‌ఫ్లో ఉంది.నెట్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ 0.6 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 4.8 బిలియన్ డాలర్లుగా ఉంది.

FY20లో కరెంట్ అకౌంట్ లోటు ఎంతంటే
నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చిపోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికరవ్యత్యాసాన్ని కరెంట్ అకౌంట్ ప్రతిబింబిస్తుంది. వస్తువులు, సేవలకు సంబంధించి ఒక దేశం ఎగుమతులు-దిగుమతుల ట్రాన్సాక్షన్స్ వ్యయాలు, విదేశీ ఇన్వెస్టర్లకు చేసిన చెల్లింపులు, వచ్చిన నిధులు, ఆయా పరిమాణాల వ్యత్యాసాలు అన్నీ కరెంట్ అకౌంట్‌లోకి వస్తాయి. సాధారణంగా కరెంట్ అకౌంట్ లోటుతో ఉంటుంది. కరోనా నేపథ్యంలో దిగుమతులు భారీగా పడిపోవడంతో రెండు క్వార్టర్లుగా కరెంట్ అకౌంట్ మిగులు నమోదవుతుంది. 2019-20లో కరెంట్ అకౌంట్ లోటు 24.6 బిలియన్ డాలర్లు.