తొమ్మిది నెలల్లో 13 శాతం పెరిగిన నగదు చలామణి, ఎందుకంటే
గత తొమ్మిది నెలల కాలంలో తొలిసారి కరెన్సీ సర్క్యులేషన్ పెరిగింది. కరోనా నేపథ్యంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగాయి. అంతేకాదు, ఎప్పుడు ఏం అవసరమవుతుందోనని చేతిలో డబ్బులు ఉంచుకునేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో (ఏప్రిల్-డిసెంబర్) నగదు చలామణి 13 శాతం పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

కరెన్సీ సర్క్యులేషన్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) డేటా ప్రకారం కరెన్సీ ఇన్ సర్క్యులేష్ (CiC) 13.2 శాతం లేదా రూ.3,23,003 కోట్లు పెరిగింది. మార్చి 31, 2020 నాటికి నగదు చలామణి రూ.24,47,312 కోట్లు కాగా, జనవరి 1, 2021 నాటికి రూ.27,70,315 కోట్లకు పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2019-20)లోని ఏప్రిల్-డిసెంబర్ త్రైమాసికంలో ఇది 6 శాతం పెరిగింది. ఇప్పుడు అంతకు రెండింతల కంటే ఎక్కువగా 13 శాతం పెరిగింది.

అందుకే డిమాండ్
లాక్ డౌన్ కారణంగా ఎప్పుడు ఏ అవసరం ఉంటుందోనని ప్రజలు ముందు జాగ్రత్తతో నగదును అట్టిపెట్టుకున్నారని కేర్ రేటింగ్స్ చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నావీస్ అన్నారు. అందుకే నగదు చలామణి పెరిగినట్లు తెలిపారు. సంక్షోభం వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు చాలామంది నగదును జాగ్రత్తగా ఉపయోగిస్తారని, ఇది ముందు జాగ్రత్త మాత్రమే అన్నారు. కరోనా వల్ల ఏర్పడిన అనిశ్చితి నేపథ్యంలో కరెన్సీకి డిమాండ్ పెరిగిందని 2020 ఆగస్ట్ నెలలో విడుదల చేసిన 2019-20 వార్షిక నివేదికలో ఆర్బీఐ తెలిపింది.

నగదు వ్యాల్యూ.. వ్యాల్యూమ్
ఇక, 2020 క్యాలెండర్ ఏడాదిలో నగదు చలామణి 22.1 శాతం లేదా 5,01,405 కోట్లు పెరిగి జనవరి 1, 2021 నాటికి రూ.27,70,315 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం ఆర్బీఐ రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500, రూ. 2,000 విలువ కలిగిన నోట్లు చలామణిలో ఉన్నాయి. చలామణిలో ఉన్న నాణేలు రూ.1, రూ.2, రూ.5, రూ.10. ఇటీవల ప్రారంభించిన రూ.20 కూడా ఉంది. ఆర్బీఐ నివేదిక ప్రకారం FY20లో చలామణిలో ఉన్న నోట్ల వ్యాల్యూ, పరిమాణం వరుసగా 14.7 శాతం, 6.6 శాతం. విలువ పరంగా 2020 మార్చి చివరి నాటికి రూ.500, రూ.2000 నోట్ల వ్యాల్యూ 83.4 శాతం.