అలా ఐతే ఏడాదిలో ఇస్తాం: అమరరాజా, జీఎంఆర్, జీవీకే.. మన కంపెనీల్లోను వేతన కోత, ఎవరికి ఎంత కట్?
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు వేతనాల్లో కోత విధిస్తున్నాయి. కార్పోరేట్ కంపెనీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగుల వేతనాల్లో కోత విధించనున్నట్లు ప్రకటించాయి. గల్లా జయదేవ్‌కు చెందిన అమర రాజా గ్రూప్‌తో పాటు జీవీకే, జీఎంఆర్ సంస్థలు ఉద్యోగుల వేతనాల్లో 30 శాతం నుండి 50 శాతం కోత విధిస్తున్నాయి.

ఇంక్రిమెంట్లు నిలిపేశాం.. అమర రాజా
కరోనా కారణంగా వ్యాపార కార్యకలాపాలు కుంచించుకుపోయాయని, దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో సిబ్బందికి ఇంక్రిమెంట్స్ నిలిపివేసినట్లు అమర రాజా బ్యాటరీస్ తెలిపింది. ఉన్నతస్థాయి సిబ్బందికి 10 శఆతం నుండి 25 శాతం వరకు వేతనాల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ గ్రూప్ ప్రమోటర్లు తమ రెమ్యునరేషన్‌లో 50 శాతం తగ్గింపుకు ముందుకు వచ్చారు. కార్మికులకు, శిక్షణ ఉద్యోగులకు మాత్రం వేతనాల కోత లేదని ఊరట ప్రకటన చేశారు.

అమర రాజా బీపీఎల్‌పీ
అమర రాజా గ్రూప్ బీపీఎల్‌పీ (బిజినెస్ పర్ఫార్మెన్స్ లింక్డ్ పే) పథకాన్ని తీసుకు వచ్చింది. దీని ప్రకారం ప్రస్తుతం జీతభత్యాల్లో కోతపడినా ఉన్నతస్థాయి ఉద్యోగులకు, వచ్చే ఏడాది వ్యాపార కార్యకలాపాలు కోలుకున్న పక్షంలో తిరిగి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఉత్పత్తులకు వివిధ విభాగాల నుండి ఆశించిన డిమాండ్ ఉండకపోవచ్చునని, ఆదాయాలు తగ్గే అవకాశం ఉందని, అందుకే వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు అమర రాజా పేర్కొంది. ఈ పరిస్థితిని తట్టుకునేందుకు వీలైన అన్ని వ్యాపార అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ కంపెనీలో గత ఆర్థిక సంవత్సరం మార్చి 31వ తేదీ నాటికి 7,541 మంది సిబ్బంది ఉన్నారు. వీరికి ప్రతి సంవత్సరం వేతన రూపంలో రూ.345 కోట్లకు పైగా చెల్లిస్తున్నారు. ఈ ఏడాది ఇంక్రిమెంట్లు నిలిపి వేశారు.

GVKలో 10 శాతం నుండి 30 శాతం కోత
జీవీకే గ్రూప్ వేతనాల్లో 30 శాతం కోత విధించింది. ఇది మే నెల నుండి అమలులోకి వస్తున్నట్లు తెలిపిందని వార్తలు వచ్చాయి. కరోనా - లాక్ డౌన్ నేపథ్యంలో గత మూడు నెలల కాలంలో వ్యాపారాలు క్లోజ్ అయ్యాయని, దీంతో ఈనిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. జీవీకే గ్రూప్‌లో 1800 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు.
రూ.10 లక్షల నుండి రూ.25 లక్షలకు పైగా వేతనం ఉన్న వారికి 10 శాతం కోత, రూ.25 లక్షలకు పైగా వేతనం అందుకుంటున్న వారికి 20 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. సీనియర్, మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగుల వేతనాల్లో 30 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది.

GMR వేతన కోత 50 శాతం
జీఎంఆర్ గ్రూప్ కూడా మే నెల వేతనాల్లో 50 శాతం తగ్గించింది. ఉన్నత స్థాయి ఉద్యోగులకు ఎక్కువగా కోత పడిందని వార్తలు వస్తున్నాయి. సవరింపుల్లో భాగంగా ఉద్యోగులపై కంపెనీ చేసే వ్యయాల్లో (కాస్ట్ టు కంపెనీ) మార్పులు మే నెల వేతనం నుండి చేశారని తెలుస్తోంది.