భారీ షాక్: కాగ్నిజెంట్‌లో 18,000 ఉద్యోగాల కోత? లీగల్ యాక్షన్ దిశగా.. కంపెనీ ఏమన్నది
బెంగళూరు: ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ పెద్ద ఎత్తున ఉద్యోగాలను తొలగించనుందని వార్తలు వస్తున్నాయి. పర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ ఆధారంగా వీరిని తొలగించే అవకాశముందని తెలుస్తోంది. పదులు, వందలు కాదు ఏకంగా 18,000 మందిని ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధపడిందని వార్తలు వచ్చాయి. దేశవ్యాప్తంగా వివిధ యూనిట్లలో పని చేస్తున్న వారిని తొలగించాలని చూస్తోందని వార్తలు రావడంతో కాగ్నిజెంట్ కూడా స్పందించింది.
మీకు ఐటీ రీఫండ్స్ రాలేదా.. దానికి త్వరగా సమాధానం ఇవ్వండి!

18,000 ఉద్యోగుల కోత?
ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్.. ప్రస్తుతం సంస్థలో ఆశించిన విధంగా ప్రాజెక్టులు లేకపోవడంతో బెంచ్‌కు పరిమితమైన దాదాపు 18,000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు సిద్ధమైందని పేర్కొంటున్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె, కొచ్చి, కోల్‌కతా బ్రాంచీల్లో పని చేసే వారిపై వేటు పడుతుందని వార్తలు వచ్చాయి.

న్యాయపరమైన చర్యలు..
సామూహిక ఉద్యోగాల తొలగింపు వార్తల నేపథ్యంలో లేబర్ యూనియన్ న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. పెద్ద ఎత్తున ఉద్యోగాలు తొలగిస్తే లీగల్ యాక్షన్ తప్పదని కర్ణాటక ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్చరించింది.

కాగ్నిజెంట్ ఏం చెప్పింది?
ఉద్యోగుల తొలగింపుపై కాగ్నిజెంట్ అధికార ప్రతినిధి స్పందించారు. తమ సంస్థ కొంతమంది ఉద్యోగాలను తొలగించనుందని థర్డ్ పార్టీ చేస్తోన్న ఆరోపణల్లో ఖచ్చితత్వం లేదన్నారు. కాగ్నిజెంట్ ఎలాంటి తొలగింపు ప్రకటన చేయలేదని చెప్పారు. తాము ఇప్పటికీ హైరింగ్ చేసుకుంటున్నట్లు కూడా కాగ్నిజెంట్ చెబుతోంది. 'ఇటీవల థర్డ్ పార్టీ చేసిన ఆరోపణలు ఖచ్చితత్వమైనవి కాదు. కాగ్నిజెంట్ భారత్, ప్రపంచవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో కొత్త నియామకాలు చేపడుతోంది' అని కాగ్నిజెంట్ పేర్కొంది. అయితే కాగ్నిజెంట్ సహా ఐటీ ఇండస్ట్రీలో పర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ సహజమేనని చెబుతోంది.

ఆందోళన
ఇదిలా ఉండగా, ఉద్యోగుల పనితీరుపై సంస్థ ఇచ్చిన రేటింగ్ ప్రకారం 45 రోజుల్లో పనితీరు మెరుగుపర్చుకోవడంలో విఫలమైన వారికి ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తుందని, అలాంటి వారిని రాజీనామా చేయాలని కోరుతోందని పలువురు బాధితులు చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఉద్వాసనకు గురైన ఉద్యోగుల అనుభవాన్ని బట్టి పన్నెండు నుండి ఇరవై ఒక్క వారాల ప్యాకేజీతో పాటు ఏడాదికి వారం వేతనం చొప్పున ప్యాకేజీని ఇచ్చి పంపిస్తున్నారట. గత ఏడాది 35-60 రోజులపాటు బెంచ్‌కు పరిమితమైన ఉద్యోగులను వైదొలగాలని కాగ్నిజెంట్ కోరింది.

ఉద్యోగాల కోతపై ఖండన
కాగ్నిజెంట్‌లో పనితీరు ఆధారంగా ఉద్యోగాల తొలగింపు ఉంటుందని వార్తలు వస్తున్నాయని, దేశమంతా వేలామంది బాధితులు కానున్నారని, ఇప్పటికే తమను కొంతమంది సంప్రదించారని కర్ణాటక స్టేట్ ఐటీ/ఐటీస్ ఎంప్లాయీస్ యూనియన్ (KITU) తెలిపింది. చట్టవిరుద్ధమైన చర్యలపై న్యాయపరమైన పోరాటం ఉంటుందని తెలిపింది. ఉద్యోగుల తొలగింపును ఖండిస్తున్నట్లు తెలిపింది.

అమెరికాలో వాలంటరీ ప్యాకేజీ
కాగా, కొద్ది వారాల క్రితం మే 1 నుండి ఆగస్ట్ 31వ తేదీ వరకు బెంచ్‌కు పరిమితమైన అమెరికా ఉద్యోగులకు కాగ్నిజెంట్ వాలంటరీ సెపరేషన్ ప్యాకేజీ ప్రకటించింది. 2019 నుండి కాగ్నిజెంట్‌లో టాప్ లెవల్‌లో కొంతమందిని తొలగించింది. గత ఏడాది అక్టోబర్‌లో రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత ఉంటుందని హింట్ ఇచ్చింది.