ఒక షాట్ వేద్దామా: రేప్‌ను ప్రోత్సహించేలా యాడ్: కేంద్రం నిలిపివేత: ట్విట్టర్, యూట్యూబ్‌కూ
న్యూఢిల్లీ: బహుళ జాతి కంపెనీలు తమ ప్రొడక్ట్స్‌ను విక్రయించుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తుంటాయి. అది సమాజానికి మంచి చేస్తుందా? చెడును ప్రోత్సహిస్తుందా? అని ఆలోచించవు. సులభంగా జనంలోకి చొచ్చుకెళ్లడానికి, మెదళ్లల్లో జొప్పించడానికి ఇచ్చే ప్రాధాన్యత.. మంచి-చెడుల మీద ఇవ్వవు. ఈ విషయం చాలా సందర్భాల్లో స్పష్టమైంది. ఇప్పుడు మరోసారి పరిస్థితే ఏర్పడింది.
|
లేయర్ నిర్వాకం..
గుజరాత్‌కు చెందిన లేయర్ (Layer'r) కంపెనీ తయారు చేసిన బాడీ స్ప్రే అడ్వర్టయిజ్‌మెంట్ కూడా ఇలాంటిదే. ఆ బాడీ స్ప్రే పేరు.. షాట్ (Shot body spray). ఈ బాడీ స్ప్రేను ప్రచారం కోసం షూట్ చేసిన అడ్వర్టయిజ్‌మెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అత్యాచారాలను ప్రోత్సహించేలా ఈ యాడ్‌ను కంపెనీ యాజమాన్యం రూపొందించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా నెటిజన్లు తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు.
|
డబుల్ మీనింగ్ డైలాగ్స్..
ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లిన నలుగురు యువకులు- అక్కడ షాట్ బాడీస్ప్రేను కొనాలని అనుకుంటారు. అదే సమయంలో ఓ యువతి ఒంటరిగా అక్కడికి రాగా- వారు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ప్రయోగిస్తారు. మే నలుగురం ఉన్నాం.. అక్కడ ఒకటే ఉంది.. షాట్ ఎవడు వేస్తాడు.. అంటూ కామెంట్స్ చేస్తారు. దీనితో ఆ యువతి బిత్తరపోతుంది. ఆ నలుగురిలో ఒకడు షాట్ బాడీస్ప్రేను చేతుల్లోకి తీసుకోవడంతో ఆమె ఊపిరి పీల్చుకుంటుంది.

అసభ్యకరంగా..
దాదాపుగా ఇదే కాన్సెప్ట్‌తో మరో యాడ్ కూడా రూపొందించింది లేయర్స్ కంపెనీ. గదిలో బెడ్‌పై లవర్స్ కూర్చుని ఉండగా.. ముగ్గురు యువకులు అక్కడికి వస్తారు. వారిలో ఒకడు- షాట్ వేయాలని ఉంది అని అడగ్గా.. వేస్కో అంటూ పర్మిషన్ ఇస్తాడా లవర్. వెంటనే ఆ ముగ్గరిలో ఒకడు- ఇప్పుడు మా వంతు.. అంటూ బెడ్ వైపు వస్తాడు. దీనితో అతని గర్ల్‌ఫ్రెండ్ ఉలిక్కిపడుతుంది. బెడ్ పక్కనే ర్యాక్‌లో ఉంచిన షాట్ బాడీస్ప్రేను అందుకుంటాడు. ఇప్పుడీ యాడ్స్ రెండూ నెటిజన్ల ఆగ్రహజ్వాలకు గురి అవుతున్నాయి.

నిలిపివేతకు కేంద్రం ఆదేశాలు..
దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. షాట్ బాడీ స్ప్రే అడ్వర్టయిజ్‌మెంట్స్‌ను నిలిపివేసింది. ఈ మేరకు సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన అడ్వర్టయిజ్‌మెంట్లను ప్రమోట్ చేయొద్దంటూ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్, యూట్యూబ్‌నూ సూచించింది. అత్యాచారాలను ప్రోత్సహించేలా ఉందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐ అండ్ బీ శాఖ అధికారులు తెలిపారు.

స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్..
ఈ అడ్వర్టయిజ్‌మెంట్ మీద అటు ఢిల్లీ మహిళా కమిషన్ సైతం స్పందించింది. దేశంలో అత్యాచారాలను ప్రోత్సహించేలా దీన్ని రూపొందించారని ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ విమర్శించారు. దీనిపై సమగ్ర నివేదిక అందించాలని ఢిల్లీ పోలీసులకు నోటీసులను జారీ చేసినట్లు చెప్పారు. తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించామని అన్నారు. అన్ని రకాల ప్లాట్‌ఫామ్స్ మీద ఈ వాణిజ్య ప్రకటనను నిలిపివేయాల్సిన అవసరం ఉందని స్వాతి మలివాల్ చెప్పారు.