రూ.27 లక్షల కోట్లకు.. లాక్‌డౌన్ తర్వాత 10% పెరిగిన క్యాష్ సర్క్యులేషన్
పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు చలామణి తగ్గుతుందని భావించారు. ఓ వైపు డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నప్పటికీ ఆశించిన మేరకు నగదు చలామణి తగ్గడం లేదు. ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత మూడేళ్లలో నగదు చలామణి 34 శాతం మేర పెరిగింది. 2018లో రూ.18.03 లక్షల కోట్లుగా ఉన్న నగదు చలామణి, 2020 నాటికి రూ.24.20 లక్షల కోట్లకు పెరిగింది. ఇందులో 83.4 శాతం వాటా రూ.2,000, రూ.500 నోట్లదే. గత మూడేళ్లలో రూ.500 నోట్ల చలామణి 90 శాతం పెరగగా, రూ.2000 నోట్ల చలామణి 18 శాతం మేర పెరిగాయి.

కరోనా తర్వాత 10 శాతం పెరిగిన నగదు చలామణి
కరోనా వైరస్ నేపథ్యంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగిన విషయం తెలిసిందే. అదే సమయంలో లాక్ డౌన్ నుండి క్యాష్ సర్క్యులేషన్ 10 శాతం మేర పెరిగింది. మార్కెట్‌లోని నగదు మొత్తంలో 60.8 శాతం వాటా రూ.500 నోట్ల రూపంలో, 22.6 శాతం రూ.2000 నోట్ల రూపంలో ఉంది. ఆ తర్వాత రూ.100 నోట్లు 8.2 శాతం, రూ.200 నోట్లు 4.4 శాతం చలామణిలో ఉన్నాయి. మూడేళ్లలో చిల్లర నాణేలల చలామణి 2.71 శాతంగా మాత్రమే ఉంది. ఇప్పటికే గత ఆర్థిక సంవత్సరంలో రూ.200 నోట్లను ముద్రించలేదని ఆర్బీఐ తెలిపింది.

రూ.24 లక్షల కోట్ల నుండి రూ.27 లక్షల కోట్లకు
ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుండి నగదు చలామణీ ఏకంగా 26.9 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే పది శాతం పెరిగింది. 2020 మార్చి నాటికి చలామణిలో రూ.24.5 లక్షల కోట్ల నగదు ఉంటే, ఆగస్ట్ నాటికి రూ.26.9 లక్షల కోట్లుగా ఉంది. గత రెండేళ్లలో రూ.2000 నోట్ల చలామణి క్రమంగా తగ్గుతోంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా పెరగడం గమనార్హం. బ్యాంకుల్లో కరెన్సీ డిపాజిట్ రేషియో 15.1 శాతం నుండి 16.3 శాతానికి పెరిగింది.

నకిలీ నోట్లు
గత ఆర్థిక సంవత్సరం 2,96,695 నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. ఇందులో 4.6% ఆర్బీఐ, మిగతా 95.4% వివిధ బ్యాంకులు గుర్తించాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే నకిలీ కరెన్సీ పెరిగింది. గతంతో పోల్చితే 2019-20లో దొరికిన రూ.10, 50, 200, 500 నకిలీ నోట్లలో వరుసగా 144.6%, 28.7%, 151.2%, 37.5% పెరుగుదల కనిపించింది. రూ.2,000 నకిలీ నోట్లు 17,020 పట్టుబడ్డాయి. నకిలీకి తావులేకుండా రూ.100 నోట్ల ముద్రణలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ క్రమంలో గతంతో చూస్తే రూ.20, 100, 2,000 నకిలీ నోట్ల ప్రవాహం తగ్గిందని గుర్తుచేసింది.