క్రిప్టో మార్కెట్ దారుణ పతనం, బిట్ కాయిన్ 30,000 డాలర్ల దిగువకు
క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ దారుణంగా పతనమైంది. చాలా రోజుల తర్వాత ఇది ఏకంగా 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఈ వార్త రాసే సమయానికి 22,775 డాలర్ల వద్ద కదలాడంది. మిగతా క్రిప్టో కరెన్సీలు కూడా దారుణంగా పతనమయ్యాయి. ఎథేర్, డోజీకాయిన్ 7 శాతం కంటే ఎక్కువ దిగజారాయి. బిట్ కాయిన్ దారుణ పతనం అనంతరం 24 గంటల్లోనే క్రిప్టోకరెన్సీ మార్కెట్ 98 బిలియన్ డాలర్లు క్షీణించింది. అంటే దాదాపు 100 బిలియన్ డాలర్లు పతనమైంది. బిట్ కాయిన్ 30,000 డాలర్ల దిగువకు పడిపోవడం నాలుగు వారాల తర్వాత ఇదే మొదటిసారి.
ప్రపంచ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.2 ట్రిలియన్లకు పడిపోయింది. బిట్ కాయిన్ అంతకుముందు రోజు కంటే 6 శాతం పతనమై 29,700 డాలర్ల వద్ద కదలాడింది. ఎథేర్, డోజీకాయిన్ వరుసగా 8 శాతం, 12 శాతం క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ అమ్మకాలు వెల్లువెత్తాయి. కరోనా కేసులు పెరగడం, డెల్టా వేరియంట్ ఆందోళనల ప్రభావం క్రిప్టో మార్కెట్ పైన కనిపిస్తోంది. అంతర్జాతీయ సూచీలు కూడా క్షీణించాయి.

డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ జూలై 19న 2.1 శాతం పతనమైంది. అక్టోబర్ 2020 నుండి అత్యంత దారుణ పతనం ఇదే. బిట్ కాయిన్ 6 శాతం (29,700 డాలర్లు), ఎథేరియం 8.34 శాతం (1,732 డాలర్లు), బియాన్స్ కాయిన్ 13 శాతం (260 డాలర్లు), టెథేర్ 0.02 శాతం (1 డాలర్లు), డోజీకాయిన్ 8.18 శాతం (0.16 డాలర్లు) పతనమయ్యాయి. పోల్కాడాట్ ఏకంగా దాదాపు 14 శాతం పడిపోయింది.