సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో దేశీయ టెలికాం కంపెనీలు వణికిపోతున్నాయి. ఆ స్థాయిలో బకాయిలు తాము చెల్లించలేమంటూ చేతులెత్తేస్తున్నాయి. వ్యాపారం సాగించలేమని, దివాలా తీయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదంటూ గగ్గోలు పెడుతున్నాయి.
ఒకవైపు టెలికాం కంపెనీలు దిగాలుపడిపోతుంటే.. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకులు మరింత వణికిపోతున్నాయి. ఎందుకిలా? అంటే.. టెలికాం కంపెనీలకు వాటి వ్యాపార అవసరాల కోసం లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇచ్చింది మరి ఈ బ్యాంకులే.

అప్పుల కుప్పగా.. టెలికాం రంగం!
దేశంలో టెలికాం రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ రంగంలో వ్యాపారం సాగిస్తోన్న టెలికాం కంపెనీలకు రూ.7 లక్షల కోట్లకుపైగా అప్పులు ఉన్నట్లు తెలుస్తోంది. లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రమ్ ఫీజులు, నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతుండడం.. మరోవైపు టెలికాం రంగంలో టారిఫ్ వార్ తీవ్రం కావడంతో టెలికాం నెట్‌వర్క్ ప్రొవైడర్లకు నష్టాలు తప్పడం లేదు.

ప్రభుత్వానికే చెల్లించాల్సిన బకాయిలు ఎంతంటే...
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి టెలికాం కంపెనీలు స్పెక్ట్రమ్ చార్జీల రూపంలో రూ.40 వేల కోట్లు, లైసెన్సు ఫీజుల కింద రూ.39 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటికి అదనంగా సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ప్రకారం... అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ(ఏజీఆర్) బకాయిల కింద కేంద్రానికి రూ.93 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. పైగా ఏజీఆర్ బకాయిలు మూడు నెలల్లోగా చెల్లించాలంటూ టెలికాం కంపెనీలను సుప్రీం ఆదేశించింది.

జియో రావడమే పెద్ద దెబ్బ అనుకుంటుంటే...
అసలే రిలయన్స్ జియో రంగ ప్రవేశం తరువాత.. టారిఫ్ వార్‌తో వ్యాపారం సరిగ్గా సాగక సతమతమవుతోంటే.. పులి మీద పుట్రలా ఏజీఆర్ బకాయిలు వచ్చి పడడంతో టెలికాం కంపెనీలకు దిమ్మతిరిగిపోయింది. ఇప్పటికే టాటా టెలీ సర్వీసెస్ ఎయిర్‌టెల్‌కు అమ్ముడుపోగా, ఈ కంపెనీ ప్రభుత్వానికి రూ.13 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇంకా వైపు ఎయిర్ సెల్, ఆర్‌కామ్ దివాలా తీశాయి. ఐడియా కాస్తా వొడాఫోన్‌లో కలిసిపోయింది.

బ్యాంకుల అప్పు రూ.1.15 లక్షల కోట్లు...
దేశంలోని టెలికాం కంపెనీలకు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు రూ.1.15 లక్షల కోట్ల వరకు అప్పులు ఇచ్చాయి. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే రూ.37,300 కోట్లు ఇవ్వగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.24,500 కోట్లు ఇచ్చింది. యాక్సిస్ బ్యాంకు రూ.17,100 కోట్లు, యూనియన్ బ్యాంకు రూ.15,300 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.11,500 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.7,300 కోట్లు, ఐడీబీఐ బ్యాంకు రూ.6,200 కోట్లు, కెనరా బ్యాంకు రూ.6,100 కోట్లు, యెస్ బ్యాంకు రూ.5,100 కోట్లు, కోటక్ బ్యాంకు రూ.4,700 కోట్లు, ఇండస్ ఇండ్ బ్యాంకు రూ.2,500 కోట్లు అప్పు ఇచ్చాయి.

తగ్గించాలి, లేకపోతే దివాలాయే...
ఏజీఆర్ బకాయిలపై సుప్రీంకోర్టు తాజా తీర్పు ఇచ్చిన తరువాత వొడాఫోన్ ఐడియా చేతులెత్తేసింది. ఆ కంపెనీ సీఈవో రీడ్ మాట్లాడుతూ.. ఇలాగైతే ఇండియాలో వ్యాపారం సాగించడం ఇక కష్టమని, అవసరమైతే తాము లిక్విడేషన్‌కు వెళ్లే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామని ప్రకటించారు. అంతేకాదు.. ఈ ఏడాది రెండో త్రైమాసికానికి వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కూడా రూ.25 వేల కోట్లకుపైగా నష్టాన్ని ప్రకటించాయి. ఇప్పటికే అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాలా తీయగా.. వొడాఫోన్ ఐడియా కూడా దివాలా అంచున నిలిచింది.

తీవ్ర ఆందోళనలో బ్యాంకులు...
టెలికాం రంగంలో భారీ నష్టాలు నమోదు కావడం, కొన్ని టెలికాం కంపెనీలు దివాలా తీయడంతో ఇన్నాళ్లూ వాటికి అప్పులిచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఎందుకంటే, టెలికాం రంగంలోని వివిధ కంపెనీలకు ఇప్పటి వరకు ఈ బ్యాంకులు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చి ఉన్నాయి. ఈ కంపెనీలు దివాలా పిటిషన్ గనుక దాఖలు చేస్తే.. తమ బకాయిల వసూలు దాదాపు అసాధ్యమని బ్యాంకులు భావిస్తున్నాయి. పైగా ఇవి అప్పు తీసుకునేందుకు కొలేటరల్ సెక్యూరిటీగా స్పెక్ట్రమ్‌ను మాత్రమే గ్యారెంటీగా ఉంచాయి తప్ప పర్సనల్ గ్యారెంటీగానీ, కార్పొరేట్ గ్యారెంటీగాని ఇవ్వలేదు. దీంతో బ్యాంకుల్లో వణుకు మొదలైంది. ఈ పరిస్థితిపై ఇప్పటికే కొన్ని బ్యాంకులు కేంద్రానికి లేఖలు కూడా రాశాయి.

ఉపశమన చర్యలపై కేంద్రం దృష్టి...
కేంద్రంలోని మోడీ సర్కారు కూడా టెలికాం రంగంలోని అనిశ్చితిపై నిశితంగా గమనిస్తోంది. సుప్రీం తాజా తీర్పు నేపథ్యంలో టెలికాం రంగమే కుదేలైపోవడం, వివిధ కంపెనీల నుంచి వినతులు వస్తుండడం, మరోవైపు బ్యాంకులు కూడా తల్లడిల్లుతుండడంతో ఈ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఏజీఆర్ బకాయిల విషయంలో వడ్డీలు, పెనాల్టీల తగ్గింపు వంటి ఆప్షన్లను పరిశీలిస్తోంది. అలాగే బకాయిల చెల్లింపులకు సంబంధించి వ్యవధి పొడిగింపు, లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ చార్జీల తగ్గింపు వంటి వాటిని కూడా పరిశీలిస్తోంది. ఎందుకంటే.. ఈ పరిస్థితుల్లో టెలికాం రంగానికి మినహాయింపులు ఇవ్వకుంటే.. అది బ్యాంకింగ్ రంగానికే ప్రమాదం!
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications