బ్లాక్ ఫ్రైడే: నష్టాల్లో స్టాక్ మార్కెట్: తొలి గంటలోనే భారీ పతనం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ పతనం కొనసాగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్‌ను పెంచిన తరువాత ఆరంభమైన ఈ క్షీణత ఇవ్వాళ కూడా కనిపించింది. ఇన్వెస్టర్లకు మరో బ్లాక్ ఫ్రైడేలా మారింది. తొలి గంటలోనే సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం అయ్యాయి. సెన్సెక్స్‌లో ఉన్న షేర్లన్నీ రెడ్ జోన్‌లో కనిపించాయి. గురువారం నాటి ట్రేడింగ్‌తో పోల్చి చూస్తే.. ఇవ్వాళ అన్నీ నష్టాల్లో ఉన్నాయి. మైనస్‌లల్లో పడిపోయాయి. దాదాపు అన్ని సెగ్మెంట్స్‌కు చెందిన షేర్ల పరిస్థితీ ఇంతే. చివరి గంట ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.

రేపో రేట్ ఎఫెక్ట్..
వడ్డీరేట్లను 40 బేసిస్‌ల మేరకు పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్ మెంట్లల్లో 0.4శాతం మేరకు పెరుగుదల చోటు చేసుకుంది. ఈ వడ్డీరేట్ల పెంపు.. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకుని వస్తుందని రిజర్వు బ్యాంక్ అంచనా వేస్తోంది. వడ్డీ రేట్లను పెంచడం వల్ల బ్యాంకుల నుంచి రుణాలను తీసుకోవడం తగ్గుతుందని, నగదు చలామణి తగ్గుతుందని అభిప్రాయపడుతోంది.

పతనం కంటిన్యూస్..
అదే సమయంలో- వేర్వేరు రూపాల్లో రుణాలను తీసుకున్న వారు.. వడ్డీని మరింత అధికంగా కట్టాల్సి రావడం వల్ల బ్యాంకుల్లో నగదు మొత్తం పెరుగుతందని రిజర్వు బ్యాంక్ చెబుతోంది. రుణాలను తీసుకునే వారి సంఖ్య తగ్గడం, అదే సమయంలో వడ్డీ రేట్లను పెంచడం వల్ల బ్యాంకుల వద్ద నగదు నిల్వలు మెరుగుపడతాయని భావిస్తోంది. రేపో రేటును పెంచినట్లు శక్తికాంత దాస్ ప్రకటించిన వెంటనే స్టాక్ మార్కెట్స్ పతనం అయ్యాయి.

830 పాయింట్లు నష్టం..
ఇవ్వాళ కూడా అది కొనసాగుతోంది. తొలి గంటలోనే 830 పాయింట్ల మేర నష్టపోయింది సెన్సెక్స్. ఆరంభం నుంచే రెడ్ జోన్‌లో ట్రేడింగ్ అవుతూ వచ్చింది. సమయం గడుస్తోన్న కొద్దీ షేర్లన్నీ మైనస్‌లోకి వెళ్లిపోవడం కనిపించింది. ఏ దశలో కూడా అప్పర్ సర్కుట్‌కు చేరుకోలేకపోయింది. తొలి గంట ముగిసే సమయానికి 54,870 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ట్రేడింగ్ నమోదైంది.

నిఫ్టీదీ అదే దారి..
నిఫ్టీ కూడా ఇదేరకమైన పతనాన్ని చవి చూసింది. తొలి గంటలో 260 పాయింట్లను నష్టపోయింది. 16,419 పాయింట్ల వద్ద నిఫ్టీ తొలి గంటలో ట్రేడింగ్ నమోదు చేసుకుంది. బజాజ్, మారుతి, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలివర్, టాటా స్టీల్స్ తొలి గంటలో తీవ్రంగా నష్టపోయాయి. ఆయా కంపెనీల షేర్ల ధరలు మూడు శాతం మేర క్షీణించాయి.

అన్ని సెగ్మెంట్లపైనా ప్రభావం..
నిఫ్టీలో టాటా మోటార్స్, హిండాల్కో, అపోలో హాస్పిటల్స్.. నష్టపోయాయి. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండైసెస్ అన్నీ 2.2 శాతం మేర నష్టాలను చవి చూశాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్స్, ఫైనాన్సియల్ సర్వీసెస్.. ఇలా అన్ని సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లన్నీ రెడ్ జోన్‌లో ట్రేడ్ అయ్యాయి. వోల్టాస్ షేర్లు- ఏకంగా ఏడు శాతం మేర నష్టపోయాయి. విప్రో 52 వారాల తరువాత కనిష్ఠాన్ని నమోదు చేసుకుంది.