ఆధార్ నెంబర్ తప్పుగా ఇస్తే, రూ.10,000 జరిమానా!
ట్రాన్సాక్షన్ సమయంలో మీరు తప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారా? అయితే ఇది మీ లాంటి వారికే. అలాంటి పరిస్థితుల్లో రూ.10,000 వరకు జరిమానా చెల్లించేందుకు సిద్ధంగా ఉండండి! ఇందుకు సంబంధించిన సవరణలు చేసి, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దీనిని అమలులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
SBI E-Rail: రైల్వే టిక్కెట్‌ను ఇలా ఈజీగా బుక్ చేసుకోండి

తప్పుగా ఇస్తే రూ.10వేల ఫైన్
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వంటి చోట్ల పాన్ కార్డుకు బదులు ఆధార్ కార్డును ఉపయోగించవచ్చునని ఇటీవల కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థికమంత్రి ప్రకటించారు. అయితే దీనిని కొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో తప్పుడు ఆధార్ నెంబర్ ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ఆర్థిక లావాదేవీల సమయంలో ఆధార్ నెంబర్ తప్పుగా ఇచ్చిన వారిపై రూ.10వేల జరిమానా విధిస్తుంది. ఇందుకు సంబంధించి చట్టంలో మార్పు తేనుంది.

చట్ట సవరణ
సంబంధిత చట్టాలలో సవరణలు చేసిన అనంతరం సెప్టెంబర్ 1వ తేదీ నుండి జరిమానా నిబంధన వర్తిస్తుందని భావిస్తున్నారు. ఐటి చట్టంలోని సెక్షన్ 272 బి (సెక్షన్ 139 ఎ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు జరిమానా విధించేది) సవరించాలని బడ్జెట్ సందర్భంగా ప్రతిపాదించారు. ఇందులో పెనాల్టీ అంశాన్ని ప్రస్తావించారు.

ప్రతి ఉల్లంఘనపై రూ.10,000 జరిమానా
హైవాల్యూ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌లలో ఆధార్ నెంబర్ సరిగా వేయని వ్యక్తిపై, ప్రతి ఉల్లంఘనకు రూ.10,000 జరిమానా విధించవచ్చునని చెబుతున్నారు. అదే సమయంలో పెనాల్టీ విధించడానికి ముందు సదరు వ్యక్తి వాదన వినాలని కూడా చెబుతున్నారు. జూలై 5న ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను అనుసరించి నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.