టాప్ 100 కుబేరుల సంపద రూ.13.8 లక్షల కోట్లు జంప్, దేశంలోని పేదలకు రూ.94వేల చొప్పున ఇవ్వొచ్చు
కరోనా మహమ్మారి సమయంలో భారత కుబేరుల ఆస్తి భారీగా పెరిగింది. గత ఏడాది మార్చి నుండి దేశంలోని టాప్ 100 శ్రీమంతుల సంపద రూ.12,97,822 కోట్ల మేర పెరిగినట్లు ఆక్స్‌ఫామ్ తాజా నివేదిక వెల్లడించింది. ఈ మొత్తాన్ని దేశంలోని 13.8 కోట్ల మంది పేదలకు ఒక్కొక్కరికి రూ.94,045 చొప్పున ఇవ్వవచ్చునని నివేదిక తెలిపింది. నిన్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆక్స్‌ఫామ్ ఈ నివేదికను విడుదల చేసింది. ది ఇన్-ఈక్వాలిటీ వైరస్ పేరుతో దీనిని తీసుకు వచ్చింది.
గత వంద సంవత్సరాలలో ఎప్పుడూలేనంత ప్రజారోగ్య సంక్షోభాన్ని ఈ కరోనాతో ప్రపంచం ఎదుర్కొంటోందని అభిప్రాయపడింది. ఇక 1930 నాటి ది గ్రేట్ డిప్రెషన్‌తోనే ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని పోల్చగలమని పేర్కొంది. కరోనా లాక్‌డౌన్ ప్రభావం ఉన్నప్పటికీ గౌతమ్ అదానీ, శివనాడార్, సైరస్ పూనావాలా, ఉదయ్ కొటక్, అజీమ్ ప్రేమ్‌జీ, సునీల్ మిట్టల్, రాధాకృషన్ దమానీ, కుమార మంగళం బిర్లా, లక్ష్మీ మిట్టల్ వంటి వారి సంపద గణనీయంగా పెరిగింది.

బొగ్గు, చమురు, టెలికం, ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, రిటైల్ రంగాలలోని కుబేరుల సంపద భారీగా పెరిగినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కుబేరులు మరింతగా ఆర్జించారని, పేదవారు మరింత పేదరికంలోకి వెళ్లినట్లు తెలిపింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంపద అయితే మరింత పెరిగినట్లు తెలిపింది. ముఖేష్ అంబానీ గంటకు రూ.90 కోట్లు సంపాదించారు. ఈ మొత్తాన్ని సాధారణ నైపుణ్యరహిత కార్మికుడికి సంపాదించేందుకు 10వేల సంవత్సరాలు పడుతుంది.