హోమ్ లోన్ EMI చెల్లించలేదా? అదో అవకాశం, అయితే ఇలా చేయండి..
బ్యాంకులు ఇచ్చే రుణాలు సెక్యూర్డ్, అన్-సెక్యూర్డ్ ఉంటాయి. పర్సనల్ లోన్ అన్-సెక్యూర్డ్ రుణం. అందుకే దీనిపై వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. ఇక హోమ్ లోన్, వెహికిల్ లోన్ సెక్యూర్డ్ లోన్స్. వీటిపై వడ్డీరేటు తక్కువగా ఉంటుంది. హోమ్ లోన్ పైన ఇచ్చే రుణానికి సంబంధించి రుణం తీసుకున్న వ్యక్తి కొనుగోలు చేసిన ఇల్లు ద్వారా ఇది సెక్యూర్డ్ రుణంగా చెప్పవచ్చు. మోర్టగేజ్ లోన్, ప్రాపర్టీ పైన రుణం సెక్యూర్డ్ లోన్స్. రెసిడెన్షియల్ లేదా కమర్షియల్ ప్రాపర్టీ పైన రుణం తీసుకోవచ్చు. పెళ్లళ్లు, మెడికల్ ఖర్చులు, ఇతర వ్యాపార అవసరాల కోసం డబ్బులు అవసరమైతే ఇలా రుణం తీసుకుంటారు.
కరోనా నేపథ్యంలో ఇటీవల హోమ్ లోన్ వడ్డీ రేట్లు భారీగా తగ్గడంతో వివిధ రకాల హోమ్ లోన్స్ తీసుకుంటున్నారు. అయితే అనుకోని ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు ఈఎంఐ చెల్లింపులో జాప్యం జరగవచ్చు. ఈఎంఐలు పెరిగితే ఇబ్బందకరమే. వాయిదాలు పెరిగి, వాటిపై వడ్డీ, ఛార్జీ పెరిగి ఆర్థికంగా చిక్కుల్లోకి నెడుతుంది. కొన్ని సందర్భాల్లో తిరిగి చెల్లించలేని పరిస్థితి నెలకొంటుంది. అలాంటి సమయంలో బ్యాంకులు రుణాన్ని ఎలా వసూలు చేస్తాయో చూడండి.

ఈఎంఐ చెల్లించకుంటే
సాధారణంగా ఒక నెల లేదా రెండు నెలలు ఈఎంఐలు చెల్లించకుంటే బ్యాంకులు చిన్న చిన్న హెచ్చరికలు జారీ చేస్తాయి. కానీ వరుసగా మూడో నెల ఈఎంఐ చెల్లించని పరిస్థితులు ఉంటే అది ప్రమాద సంకేతమే. అప్పుడు బ్యాంకులు అప్రమత్తమై మీ రుణాన్ని ఎన్పీఏగా గుర్తించవచ్చు. నోటీసులు వస్తాయి. అప్పటికీ మీరు స్పందించకుంటే దివాలా రుణగ్రహీతగా గుర్తించి ఇంటికి నోటీసులు పంపిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది.
రుణ చెల్లింపు కోసం సర్ఫేసీ చట్టం ప్రకారం ఆరవై రోజుల గడువుతో తుది నోటీసులు పంపిస్తుంది. రుణ వాయిదాలను అప్పటికీ చెల్లించకుంటే చట్ట ప్రకారం ఆ ఆస్తిని రుణం ఇచ్చిన సంస్థ స్వాధీనం చేసుకోవచ్చు. కోర్టు, చట్టపరమైన జోక్యం అవసరం లేకుండా ఈ పని చేస్తుంది.

అదో అవకాశం.. కానీ
బ్యాంకు అరవై రోజుల గడువుతో తుది నోటీసులు ఇస్తే.. అది మీకు రుణ వాయిదా చెల్లించడానికి చివరి అవకాశంగా భావించాలి. ఇక్కడ మరో సౌకర్యం ఉంది. ఈ అరవై రోజుల గడువులో మీరు బ్యాంకు అధికారుల వద్దకు వెళ్లి వివరణ ఇవ్వవచ్చ. రాతపూర్వకంగా ఆర్థిక పరిస్థితిని తెలియజేసి, ఒప్పించవచ్చు.
అప్పుడు జరిమానాతో నోటీసు పీరియడ్ పెంచవచ్చు. అయితే బ్యాంకు అధికారులు నిరాకరిస్తే మాత్రం రుణగ్రహీత ఏం చేయలేడు. అరవై రోజుల గడువు తర్వాత రికవరీ ఏజెంట్లు మీ వద్దకు వస్తారు. రికవరీ ఏజెంటు ఐడీ కార్డును అడగవచ్చు. బ్యాంకు నుండి ఆథరైజేషన్ లేఖ తీసుకు వస్తారు. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే వారు రావాలి. దివాలాదారుగా గుర్తించిన వ్యక్తితో మాట్లాడాలి. ఇతరులతో మాట్లాడేందుకు వీల్లేదు. రికవరీ ఏజెంట్ అగౌరవంగా ప్రవర్తించవద్దు.

వేలం ప్రక్రియ
ఈఎంఐలు చెల్లించకుంటే బ్యాంకులు ఆ ప్రాపర్టీని వేలం వేస్తాయి. దినపత్రికలో ప్రచురించడం ద్వారా వేలం ప్రక్రియ ప్రారంభం అవుతుంది. వేలం కోసం నిర్ణయించిన వ్యాల్యూ తక్కువ అని భావిస్తే బ్యాంకును రుణగ్రహీత సంప్రదించాలి. మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్న వారు దానిని విక్రయించుకోవచ్చు లేదా లీజుకు ఇచ్చుకోవచ్చు లేదా మరో సంస్థకు అప్పగించవచ్చు. వేలం ద్వారా వచ్చిన మొత్తంలో రుణ బకాయిని సర్దుబాటు చేసుకొని, అదనంగా మిగిలితే రుణం చెల్లించని వారికి అందిస్తుంది.

అలా చేయండి...
మీరు ఈఎంఐలు చెల్లించడంలో విఫలమై, మీ ప్రాపర్టీని బ్యాంకు విక్రయించే పరిస్థితి వస్తే.. అంతకంటే ముందు మీరు విక్రయించడం ద్వారా ఎక్కువ మొత్తం రావొచ్చు. మిమ్మల్ని దివాలాదారుగా గుర్తించగానే ప్రాపర్టీ విక్రయించే ప్రయత్నం చేయండి. ఆ సొమ్ముతో బ్యాంకులకు రుణాన్ని చెల్లించండి. బ్యాంకు వేలం కంటే మీరు సొంతగా విక్రయిస్తే అధిక ధర వచ్చే అవకాశం ఉంటుంది.

ఈఎంఐ ఎంత ఉండాలంటే
ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తకూడదంటే మీ ఆదాయంలో మూడొంతులు మాత్రమే ఈఎంఐలుగా ఉండేలా చూసుకోవాలి. అలాగే, డౌన్ పేమెంట్ సాధ్యమైనంత ఎక్కువగా చెల్లించాలి. ప్రతి నెల ఈఎంఐ కష్టంగా కనిపిస్తే దానిని పునర్వ్యవస్థీకరించాలి. వాయిదా మొత్తాన్ని తగ్గించుకొని, కాలపరిమితి పెంచుకోవాలి.