రూల్ ఆఫ్ 100, రూల్ ఆఫ్ 72, 35% రూల్: మీ పర్సనల్ ఫైనాన్స్‌కు 5 సూత్రాలు
వేతనజీవులైనా, వ్యాపారులైనా, మరే రంగంలో ఉన్నవారైనా సంపాదన ఉంటే మాత్రమే సరిపోదు. మనీ మేనేజ్‌మెంట్ అంటే డబ్బులు ఎలా ఖర్చు చేయాలనేది చాలా కీలకమైన అంశం. ఆదాయాన్ని వివిధ విభాగాలుగా చేసుకొని, దేనికి ఎంత కేటాయించాలనే అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. మనకు వచ్చే ఆదాయం, ఇంటి ఖర్చులు, బయటి ఈఎంఐలు, ప్రతి నెల ఆదాయంలో కొంత మేర పెట్టుబడికి కేటాయించడం కచ్చితంగా చేయాల్సిన పని. దీనికి తోడు ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. కరోనా మహమ్మారి అనంతరం చాలామందికి పెట్టుబడులపై అవగాహన పెరగడంతో పాటు ఎమర్జెన్సీ ఫండ్‌కు కేటాయిస్తున్నారు.
అలాగే హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్‌లు వ్యక్తికి లేదా అనుకోని పరిస్థితుల్లో ఆ వ్యక్తికి ఏమైనా అయితే అతనిపై ఆధారపడిన వారికి కాస్త ఆర్థిక తోడ్పాడును అందిస్తుంది. మీ ఆర్థిక వ్యవహారాల విస్తృతికి పలు థంబ్ రూల్స్‌ను ఫాలో కావడం మంచిది. థంబ్ రూల్స్ కచ్చితంగా అనుసరించాలని కాదు. కానీ ఇవి మిమ్మల్ని సరైన మనీ మేనేజ్‍మెంట్ వైపు నడిపించవచ్చు

ఈ ఐదు రూల్స్ అవసరం
థంబ్ రూల్స్ మన ఆర్థిక క్రమబద్దీకరణకు సహకరిస్తాయి. ప్రాథమికంగా ఒక నియమాన్ని ఏర్పరచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఐదు థంబ్ రూల్స్‌ను చూద్దాం.
- ఎమర్జెన్సీ ఫండ్ కలిగి ఉండటం.
- టర్మ్ ఇన్సురెన్స్‌ను కలిగి ఉండటం.
- రూల్ ఆఫ్ 100
- 35 పర్సెంట్ రూల్
- రూల్ ఆఫ్ 72

ఎమర్జెన్సీ ఫండ్ ఎంత?
ప్రతి వ్యక్తి ఎమర్జెన్సీ ఫండ్‌ను కలిగి ఉండాలి. కనీసం మన ఆరు నెలల శాలరీ అంత ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో లేదా సంక్షోభ సమయంలో ఇది మనల్ని గట్టెక్కించడానికి ఉపయోగపడుతుంది. ఇది రెగ్యులర్ ఖర్చులు, ఈఎంఐలు, మీ ఇన్సురెన్స్ ప్రీమియం ఖర్చులతో పాటు వీటికి కూడా కేటాయింపులు జరపాలి.
ఇలాంటి ఎమర్జెన్సీ ఫండ్ కనీసం ఆరు నెలలు కలిగి ఉండాలి. ఉదాహరణకు ఎవరైనా ఉద్యోగం కోల్పోతే వెతుక్కోవడానికి కాస్త సమయం పడుతుంది. అలాంటి సమయంలో ఈ అత్యవసర నిధి మీకు ఉపయోగపడుతుంది. చేతిలోకి ఎక్కువ మొత్తం వస్తుందనుకుంటే ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏడాది పాటు అట్టిపెట్టుకున్నా ఇబ్బంది ఉండదు.

ఏడాది వేతనంతో పది రెట్ల ఇన్సురెన్స్
లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్ తప్పనిసరి. టర్మ్ ఇన్సురెన్స్ తీసుకోవడం మంచిది. ఇది కూడా మీ ఏడాది ఆదాయంతో పోలిస్తే పది రెట్లు ఉండేలా చూసుకోవడం మంచిది. టర్మ్ ప్లాన్స్ తీసుకుంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ ఉంటుంది.

రూల్ ఆఫ్ 100
ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం చాలామంది చేసేదే. మీ ఈక్విటీ పోర్ట్‌పోలియో ఎలా ఉండాలంటే 100 మైనస్ మీ వయస్సుగా లెక్కించుకోవాలి. ఉదాహరణకు మీ వయస్సు 30 అయితే మీ పోర్ట్‌పోలియో ఈక్విటీ పోర్షన్ 100 మైనస్ 30 అంటే 70 శాతం ఉండాలి. మీ వయస్సు 40 అయితే 100 మైనస్ 40 అంటే 60 శాతం ఉండాలి.

35 శాతం రూల్
హోమ్ లోన్, స్టడీ లోన్ వంటి వాటివి ప్రయోజనకరమైనవి. అదే సమయంలో క్రెడిట్ కార్డ్ వంటి వాటిని సరిగ్గా మేనేజ్ చేయకుంటే ఆర్థిక భారం తప్పదు. ఈ భారం మీ ఆదాయంలో 35 శాతం నుండి 40 శాతానికి మించరాదు. ఇప్పటికే మీ ఈఎంఐ 40 శాతానికి చేరువైతే మరింత లోన్ తీసుకోవడానికి దూరంగా ఉండాలి.

రూల్ ఆఫ్ 72
మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు రెండింతలు కావడానికి ఎంత సమయం పడుతుందనేది కీలకం. 72ను రేట్ ఆఫ్ రిటర్న్‌తో భాగించాలి. అప్పుడు మీ డబ్బు రెండింతలు కావడానికి ఎంత సమయం పడుతుందో తెలుస్తుంది.
ఉదాహరణకు మీ రేట్ ఆఫ్ రిటర్న్ 8 శాతమైతే మీ డబ్బు రెండింతలు కావడానికి 9 సంవత్సరాలు పడుతుంది. అదే 12 శాతమైతే డబ్బు రెండింతలు కావడానికి ఆరేళ్లు పడుతుంది.