FDపై అదిరిపోయే వడ్డీ రేటు: ఆర్బీఐ ఎఫెక్ట్.. ఎంతకాలానికి ఇన్వెస్ట్ చేయవచ్చు?
ప్రయివేటు సెక్టార్ బ్యాంకు యస్ బ్యాంకు ఇటీవల వడ్డీ రేట్లను సవరించింది. ఫిక్స్డ్ డిపాజిట్(FD) వడ్డీ రేట్లను ఏడు శాతానికి పెంచింది. ఈ బ్యాంకులో FD చేస్తే మీకు ఎంతమొత్తం వడ్డీ వస్తుందో తెలుసుకోండి. సాధారణంగా రిస్క్ ఇష్టపడని వారు ఫిక్స్డ్ డిపాజిట్స్ వైపు మొగ్గు చూపుతారు. స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్‌తో పాటు వివిధ పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. దీర్ఘకాలంలో ఈ పెట్టుబడుల వల్ల ప్రయోజనం ఉండవచ్చు. కానీ స్వల్పకాలంలో లాభం ఉంటుందా లేక నష్టం ఉంటుందా చెప్పలేని పరిస్థితి. అందుకే రిస్క్ ఇష్టపడని చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. మూలధన హామీ, వడ్డీ రేటు హామీ ఉంటుంది.

యస్ బ్యాంకులో వడ్డీ రేటు
యస్ బ్యాంకులో ఏడు రోజుల నుండి 14 రోజుల కాలపరిమితిపై రెగ్యులర్ వడ్డీ రేటు 3.25 శాతం, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.75 శాతంగా ఉంది.
9నెలల నుండి 1 ఏడాది కాలపరిమితిపై రెగ్యులర్ వడ్డీ రేటు 5.25 శాతం, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.75 శాతంగా ఉంది.
1 ఏడాది నుండి 3 సంవత్సరాల కాలపరిమితిపై రెగ్యులర్ వడ్డీ రేటు 6.00 శాతం, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది.
3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల కాలపరిమితిపై రెగ్యులర్ వడ్డీ రేటు 6.25 శాతం, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7 శాతంగా ఉంది.

ఫిక్స్డ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
గతంలో యస్ బ్యాంకు నుండి ఉపసంహరణ పైన మారటోరియం విధించారు. యస్ బ్యాంకు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సమయంలో ఇన్వెస్టర్లు, ఖాతాదారులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ తర్వాత యస్ బ్యాంకు యాజమాన్య బాధ్యతలను తీసుకున్నది. క్యూఐపీ ద్వారా ఫండ్స్ సమీకరించింది. ప్రస్తుతం యస్ బ్యాంకు గట్టెక్కింది. డిపాజిటర్ల కోసం ప్రస్తుతం సురక్షితంగా ఉందని భావించవచ్చు. అయితే ఇక్కడ గమనించవలసిన మరో అంశం ఏమంటే, రూ.5 లక్షల వరకు డిపాజిట్స్ పైన బీమా ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం లోపు డిపాజిట్ చేయడం మంచిదని నిపుణుల మాట.

స్వల్పకాలానికి పెట్టుబడి
పెట్టుబడిదారులు ఏడాది నుండి రెండేళ్ల కాలపరిమితి కోసం ఇన్వెస్ట్ చేయవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. మున్ముందు ఆర్బీఐ వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఆ పెంపు కొద్దిగానే ఉండవచ్చు. అదే సమయంలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి స్వల్పకాలానికి ఇన్వెస్ట్ చేయవచ్చునని సూచిస్తున్నారు.