ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచుతున్న బ్యాంకులు.. ఏ బ్యాంకులో ఎంతంటే?
కరోనా మహమ్మారి తగ్గిన నేపథ్యంలో గతకొంతకాలంగా ప్రయివేటు, పబ్లిక్ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. HDFC బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు వంటి ప్రయివేటు రంగ బ్యాంకులు ఇటీవల వివిధ కాలపరిమితులు, మొత్తాలపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. సురక్షిత, భద్రమైన పెట్టుబడి కోసం భారతీయుల్లో అత్యంత ఆదరణ పొందిన వాటిలో ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ఉంది. ఫిక్స్డ్ ఇన్‌కం సెక్యూరిటీస్ (FDs) హామీ రాబడిని అందిస్తాయి. ఇటీవల వివిధ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి.
యాక్సిస్ బ్యాంకు రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన ఏడాది కాలపరిమితిపై 4.45 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 5.10 శాతం వడ్డీ రేటు వర్తిస్తోంది.
HDFC బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తంపై 5.10 శాతం వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్లకు 5.60 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

కొటక్ మహీంద్రా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఏడాది కాలపరిమితిపై 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం వర్తిస్తోంది.
ఐసీఐసీఐ బ్యాంకు కూడా వడ్డీ రేట్లను సవరించింది. ఏప్రిల్ 14వ తేదీ నుండి ఇవి అమలులోకి వచ్చాయి. 1 ఏడాది నుండి పదేళ్ల కాలపరిమితిపై 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. అయితే రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల లోపు డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.