హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెంచిన HDFC, నెల రోజుల్లో ఎంత పెరిగిందంటే?
ప్రయివేటురంగ దిగ్గజం HDFC బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేట్లు మరింత పెరుగుతున్నాయి. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక రెపో రేటును పెచిన విషయం తెలిసిందే. గత నెలలో 40 బేసిస్ పాయింట్లు, ఈ నెలలో 50 బేసిస్ పాయింట్లు.. మొత్తం ఐదు వారాల్లోనే రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు పెంచడంతో బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేటు 4 శాతం నుండి 4.90 శాతానికి పెరిగింది. ఆర్బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కీలక వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.

శుక్రవారం నుండి పెరిగిన వడ్డీ రేట్లు
ఇందులో భాగంగా ప్రముఖ మోర్టగేజ్ లెండర్ హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్(HDFC) గురువారం తన రిటైల్ ప్రమ్ లెండింగ్ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంచిన వడ్డీ రేట్లు శుక్రవారం నుండి అమలులోకి వచ్చాయి. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేటు 7.55 శాతానికి పెరిగింది. 800 పాయింట్లకు పైగా క్రెడిట్ స్కోర్ కలిగిన రుణగ్రహీత స్పెషల్ హౌసింగ్ లోన్ స్కీం కింద 7.55 శాతం వడ్డీ పైన రుణం పొందవచ్చు.

90 బేసిస్ పాయింట్లు
HDFC గత నెల రెండో తేదీన వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్లు, 9వ తేదీన 30 బేసిస్ పాయింట్లు, ఈ నెల 1వ తేదీన 5 బేసిస్ పాయింట్లు పెంచింది. తాజాగా 50 బేసిస్ పాయింట్లు పెంచింది. మొత్తంగా HDFC ఒక నెల రోజుల్లో 90 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును పెంచింది. నెల రోజుల్లో నాలుగుసార్లు వడ్డీ రేటు పెంచింది.

ఎంత పెరుగుతుందంటే
తాజా పెరుగుదలతో 800కు పైన క్రెడిట్ స్కోర్ కలిగిన రుణ గ్రహీత రూ.30 లక్ష రుణం తీసుకుంటే ఇప్పటి వరకు వడ్డీరేటు 7.20 శాతం నుండి 7.70 శాతానికి పెరిగింది. రూ.30 లక్షల నుండి రూ.75 లక్షల రుణం తీసుకుంటే వడ్డీ రేటు 7.45 శాతం నుండి 7.95 శాతానికి పెరిగింది. రూ.75 లక్షలకు పైన రుణం తీసుకుంటే 7.55 శాతం నుండి 8.05 శాతానికి పెరిగింది. మహిళలకు అన్నింటి పైన వడ్డీ రేటు 5 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉంటుంది.