డబ్బు పోతుందనే భయం లేకుండా మనీని డబుల్ చేయాలనుకుంటున్నారా.. ఈ పథకం మీకు సరైన ఎంపిక..
Money Saving Tips: ఈ రోజుల్లో చాలా మంది డబ్బు సేఫ్టీకీ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. రాబడి కొంత తక్కువ ఉన్నప్పటికీ.. నష్టం రాకూడదని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఇన్వెస్ట్ మెంట్ సేఫ్టీ అన్నింటికన్నా ముఖ్యమనుకునే వారికి ఇది సరైన పెట్టుబడి ఎంపికని చెప్పుకోవాలి. అదే ప్రభుత్వ గ్యారెంటీ కలిగిన కిసాన్ వికాస్ పత్ర.
కిసాన్ వికాస్ పత్ర ఇదొక చిన్న పొదుపు పథకం. దీనిలో సేవింగ్స్ చేయటం ద్వారా మీరు మీ సొమ్మును రెట్టింపు చేసుకోవచ్చు. ఈ పథకం ఇండియన్ పోస్టాఫీస్ కార్యాలయాల ద్వారా సర్టిఫికేట్ రూపంలో అందించబడుతోంది. ఇది ఒక ఫిక్స్‌డ్ రేట్ కలిగిన సేవింగ్స్ ప్లాన్. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా.. మీ సొమ్ము మొత్తం 124 నెలల్లో ( అంటే10 సంవత్సరాల 4 నెలలు) రెట్టింపు అవుతుంది.
ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్రలో 6.9 శాతం చక్రవడ్డీ రేటు అందించబడుతోంది. ఈ పథకంలో కనీసం రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. ఆ తర్వాత పెట్టుబడిని రూ.100 డినామినేషన్ లో పెంచుకోవచ్చు. దీనికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ పథకంలో పెట్టుబడికి ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు.

ఖాతా ఎలా తెరవాలి..
ఈ పథకం కింద.. ఎవరైనా పెద్దలు లేదా మైనర్ తరపున సంరక్షకులు అంటే తల్లిదండ్రులు ఖాతాను తెరవవచ్చు. మైనర్‌కు 10 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత, ఖాతా అతని పేరు మీదకు మారుతుంది. ఇది కాకుండా.. ముగ్గురు వ్యక్తులు ఏకకాలంలో జాయింట్ ఖాతాను తెరిచేందుకు వెసులుబాటు కూడా ఉంది.
కిసాన్ వికాస్ పత్ర పథకంలో ఖాతా తెరవడానికి.. ఆధార్ కార్డ్, రెసిడెంన్షియల్ రుజువు, KVP దరఖాస్తు ఫారం, వయస్సు దృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు సదరు వ్యక్తి మొబైల్ నంబర్ అవసరం ఉంటుంది. సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి వినియోగదారులు కిసాన్ వికాస్ పత్రాన్ని కొనుగోలు చేయవచ్చు. KVP సర్టిఫికేట్‌లను నగదు, చెక్, పే ఆర్డర్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

కిసాన్ వికాస్ పత్ర బదిలీ చేయటం ఎలా..
కస్టమర్లు తమ కిసాన్ వికాస్ పత్ర ఖాతాను పోస్టాఫీసులోని ఒక శాఖ నుంచి మరొక బ్రాంచ్‌కి బదిలీ చేసుకోవచ్చు. కేవీపీని కూడా ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయవచ్చు. ఇందులో నామినీ సౌకర్యం కూడా ఉంది. కిసాన్ వికాస్ పత్రాన్ని దేశంలోని ఏదైనా పోస్టాఫీసు నుంచి కొనుగోలు చేయవచ్చు.

ఆదాయపు పన్ను ఎలా..
నిబంధనల ప్రకారం.. కిసాన్ వికాస్ పత్ర నుంచి వచ్చే వడ్డీపై పన్ను విధించబడుతుంది. ఈ ఆదాయాన్ని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద పరిగణించి టాక్స్ విధిస్తారు. ఈ వడ్డీపై పెట్టుబడిదారుడికి రెండు ఆప్షన్లు లభిస్తాయి. మొదటిది 'నగదు ప్రాతిపదిక' పన్ను కాగా మరొకటి వార్షిక వడ్డీ ఆదాయంపై పన్ను. ఎలాంటి నష్ట భయం లేకుండా రాబడిని పొందాలనుకునేవారు తమ డబ్బును ఇందులో పెట్టుబడిగా పెట్టవచ్చు.
----------
మీరు మీ మొత్తాన్ని రెట్టింపు చేయాలనుకుంటే, ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి, డబ్బు పోతుందనే భయం లేదు