Wipro Q3 results: విప్రో లాభం ఫ్లాట్‌గా, మధ్యంత డివిడెండ్ ప్రకటన
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ విప్రో లిమిటెడ్ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను (Q3FY22) ప్రకటించింది. Q3FY22లో విప్రో నెట్ ప్రాఫిట్ రూ.2,969గా నమోదయింది. ఏడాది ప్రాతిపదికన ఇది దాదాపు ఫ్లాట్. గత ఏడాది ఇదే కాలంలో రూ.2,968 కోట్ల నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది. అంతకుముందు త్రైమాసికంలో (సెప్టెంబర్ త్రైమాసికం)నూ నెట్ ప్రాఫిట్ దాదాపు ఇదే స్థాయిలో (రూ.2,930 కోట్లు) ఉంది. అంటే ఏడాది ప్రాతిపదికన లేదా త్రైమాసిక ప్రాతిపదికన.. ఎలా చూసినా ఫ్లాట్‌గా ఉంది. మూడో త్రైమాసికంలో ఆదాయం రూ.20,432 కోట్లుగా నమోదయింది. అంతకుముందు త్రైమాసికంలో ఇది రూ.19,667 కోట్లు.
విప్రో కంపెనీ ఈక్విటీ షేర్‌కు రూ.1 ఇంటరిమ్ డివిడెండ్‌ను ప్రకటించింది. ఆపరేషన్స్ ద్వారా వచ్చిన రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన 29.6 శాతం పెరిగి రూ.15,670 కోట్ల నుండి రూ.20,313 కోట్లకు చేరుకుంది. విప్రో వరుసగా ఐదో త్రైమాసికంలో అద్భుత ఫలితాలను నమోదు చేసిందని విప్రో సీఈవో, ఎండీ థెరీ డెలాపోర్ట్ అన్నారు. ఆర్డర్ బుకింగ్స్ కూడా బలంగా ఉన్నట్లు చెప్పారు. గత 12 నెలల కాలంలో 100 మిలియన్ డాలర్ల రెవెన్యూ లీగ్‌లోకి మరో ఏడుగురు కొత్త కస్టమర్లు వచ్చినట్లు తెలిపారు.

నాలుగో త్రైమాసికంలో విప్రో ఐటీ సర్వీసెస్ బిజినెస్ ఆదాయం 2692 మిలియన్ డాలర్ల నుండి 2745 మిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది రెండు శాతం నుండి నాలుగు శాతం వృద్ధి. విప్రో షేర్ నేడు 3.15 శాతం నష్టపోయి రూ.691 వద్ద ముగిసింది. సెగ్మెంట్ పరంగా ఆదాయాన్ని చూస్తే ఐటీ సర్వీసెస్ బిజినెస్ నుండి త్రైమాసికంపరంగా 2.3 శాతం, వార్షిక ప్రాతిపదికన 27.5 శాతం ఎగిసి 2,639.7 మిలియన్ డాలర్లకు చేరుకుంది.