భారత కంపెనీల్లో టెక్ కంపెనీల వాటా కొనుగోలు.. మారిషస్ స్థానంలోకి అమెరికా
ముంబై: వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ గణాంకాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(FPI)కు సంబంధించి తొలి అర్ధభాగంలో మారిషస్‌ను అమెరికా వెనక్కి నెట్టి రెండోస్థానంలోకి వచ్చింది. ఏప్రిల్-సెప్టెంబర్ 2020లో అమెరికా నుండి భారత్‌లోకి 7.12 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. మారిషస్ నుండి 2 బిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(DPIIT) డేటా ప్రకారం అంతకుముందు రెండో స్థానంలో ఉన్న మారిషస్ ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది.
తొలి అర్ధ సంవత్సరంలో FDIల జోరు, 6 నెలల్లో రూ.2.22 లక్షల కోట్లు

ఏ దేశం నుండి ఎన్ని పెట్టుబడులు
అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో మారిషస్ రెండో స్థానంలో ఉండగా, ఇప్పుడు అమెరికా ఆ స్థానంలోకి వచ్చింది. గత ఏఢాది అమెరికా నాలుగో స్థానంలో ఉండింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.30 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. కేమాన్ ఐస్‌లాండ్స్ నుండి 2.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత నెదర్లాండ్స్ (1.5 బిలియన్ డాలర్లు), యూకే (1.35 బిలియన్ డాలర్లు), ఫ్రాన్స్ (1.13 బిలియన్ డాలర్లు), జపాన్ (653 మిలియన్ డాలర్లు), జర్మనీ (2020 మిలియన్ డాలర్లు), సైప్రస్ (48 మిలియన్ డాలర్లు) ఉన్నాయి.

ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం
అమెరికా నుండి FDIలు వెల్లువెత్తాయని, ఇది ఇరుదేశాల మధ్య మరింత బలోపేతానికి నిదర్శనం అని నిపుణులు చెబుతున్నారు. ఆర్థికపరంగా ఇరుదేశాల మధ్య మరింత సుహృద్భావ వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు అమెరికానే టాప్ ట్రేడింగ్ భాగస్వామిగా నిలిచింది. ఇరుదేశాల మధ్య ఆర్థిక పరమైన సంబంధాలు మెరుగుపడుతున్నాయనేందుకు ఇవి నిదర్శనాలు.

అందుకే పెరిగాయి...
అమెరికా టెక్ కంపెనీలు భారతీయ కంపెనీల్లో పెద్ద ఎత్తున వాటాలను కొనుగోలు చేస్తున్నాయని, అందుకే FDIలు అగ్రరాజ్యం నుండి వేగంగా పెరిగాయని జేఎన్‌యూ ఎకనమిస్ట్ ప్రొఫెసర్ బిస్వజిత్ ధర్ అన్నారు. మారిషస్ నుండి ఎఫ్డీఐలు తగ్గుతున్నప్పటికీ 2000 ఏప్రిల్ నుండి 2020 సెప్టెంబర్ వరకు ఈ దేశం వాటా 29 శాతంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కాలంలో భారత్ 500.12 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలను ఆకర్షించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో దేశంలోకి ఎఫ్‌డీఐలు 15 శాతం పెరిగి 30 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆగస్ట్ నెలలో 17.5 బిలియన్ డాలర్లు వచ్చాయి.