కరోనా వల్ల 80% డౌన్, సుంకం కోతతో బంగారం స్మగ్లింగ్ భారీగా తగ్గుతుంది
ముంబై: కరోనా మహమ్మారి నేపథ్యంలో పసిడి అక్రమ దిగుమతులు 2020లో 80 శాతం మేర తగ్గి 20 నుండి 25 టన్నులకు పరిమితమైనట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పసిడిపై కస్టమ్స్ సుంకాన్ని 7.5 శాతాన్ని తగ్గించడంతో అక్రమరవాణా తగ్గుతుందని తన నివేదికలో WGC తెలిపింది. భారత పసిడి మార్కెట్ పైన బడ్జెట్ ప్రభావం పేరుతో WGC నివేదిక తయారు చేసింది.
2021లో విమాన రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతుండటం, కస్టమ్స్ కోత వల్ల 2021లోను అక్రమ పసిడి రవాణా తగ్గుతుందని తెలిపింది. బడ్జెట్‌కు ముందు బంగారంపై 16.26 శాతం పన్నులు ఉండగా, కొత్త పన్ను విధానం వల్ల 2.19 శాతం తగ్గి 14.07 శాతానికి చేరుకున్నాయి.

ఇదిలా ఉండగా 2021లో గోల్డ్ డిమాండ్ తిరిగి పుంజుకోవచ్చునని WGC పర్కొంది. దిగుమతి సుంకాలు తగ్గించడం డిమాండ్‌కు ఊతమిస్తాయని చెబుతున్నారు. భారత్ సంస్కరణలతో పుంజుకునేది కేవలం ఒక గోల్డ్ మార్కెట్ మాత్రమే కాదని, పరోక్షంగా వివిధ ప్రయోజనాలు కూడా ఉంటాయని తెలిపింది.