10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..
బంగారం ధరలు భవిష్యత్తులో భగ్గుమనబోతున్నాయి. పశ్చిమాసియాలో వార్ ఇంకా వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ట్రంప్ చెప్పడంతో పరిస్థితుు మరింత ఆందోళనకరంగా మారాయి. పెట్టుబడిదారులు ఈ వార్ కొనసాగినంత కాలం తమ పెట్టుబడులను సేఫ్ హెవెన్ వైపు తరలిస్తున్నారు. దీంతో పసిడి మాత్రమే వారికి స్వర్గధామంలా కనిపిస్తోంది. దీంతో ధరలు అమాంతం పైకి ఎగబాకుతున్నాయి. అయితే రానున్న కాలంలో బంగారం ధరలు పీక్ స్టేజికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇరాన్ యుద్ద ప్రభావం కేవలం స్టాక్ మార్కెట్లకే పరిమితం కాకుండా, కమోడిటీలు, కరెన్సీలు, ముడి చమురు ధరలు, అలాగే ప్రభావిత ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ మార్కెట్ల వరకూ విస్తరించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్ స్పష్టంగా రిస్క్-ఆఫ్ దిశగా మళ్లింది. అయితే చాలా మంది మార్కెట్ నిపుణులు దీర్ఘకాలంలో ఈ యుద్ధ ప్రభావాలు క్రమంగా తగ్గుతాయని అభిప్రాయపడుతున్నారు.

గతంలోనూ అనేక భౌగోళిక రాజకీయ సంక్షోభాల తర్వాత స్టాక్ మార్కెట్లు, చమురు మార్కెట్లు మళ్లీ సాధారణ స్థితికి వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. అయినప్పటికీ బంగారం ధరలపై మాత్రం ఈ అనిశ్చితుల ప్రభావం కొనసాగవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచం ఇప్పటికే కోవిడ్ మహమ్మారి అనంతర ప్రభావాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, వడ్డీ రేట్ల అనిశ్చితి వంటి అంశాలతో పోరాడుతోంది. ఇలాంటి నేపథ్యంలో మరో పెద్ద యుద్ధం చెలరేగడం పెట్టుబడిదారుల్లో భయాన్ని పెంచుతోంది. అటువంటి సమయాల్లో చరిత్రగా చూస్తే.. పెట్టుబడిదారులు ఈక్విటీల నుంచి బయటకు వచ్చి సురక్షిత పెట్టుబడులుగా భావించే Gold వంటి ఆస్తులవైపు మొగ్గు చూపుతారు.
ఈ నేపథ్యంతోనే Jefferiesలో గ్లోబల్ ఈక్విటీ స్ట్రాటజీ హెడ్‌గా ఉన్నChris Wood ఒక సంచలన అంచనాను వెలువరించారు. ET Nowకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఐదు సంవత్సరాల్లో బంగారం ధరలు ఔన్సుకు 10 వేల డాలర్లకు చేరుకోవచ్చని తెలిపారు. అంటే ప్రస్తుత స్థాయిలతో పోలిస్తే బంగారం ధరలు రెట్టింపు కావచ్చని ఆయన అంచనా.ప్రస్తుతం భారతదేశంలో బంగారం ధరలు 10 గ్రాములకు సుమారు రూ. 1.65 లక్షలకు పైగాఉన్నాయి.
క్రిస్ వుడ్ అంచనా నిజమైతే.. వచ్చే ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లో ఈ ధరలు రూ. 3 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ స్థాయికి చేరే అవకాశం ఉందని చెప్పవచ్చు. దీనిని ఇతర పెట్టుబడులతో పోల్చి చూస్తే.. సగటున 12 శాతం వార్షిక రాబడినిచ్చే మ్యూచువల్ ఫండ్ ఒక పెట్టుబడిని రెట్టింపు చేయడానికి కనీసం ఆరు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుంది. ఆ స్థాయిలో బంగారం కూడా వేగంగా పెరుగుతుందన్నదే ఈ అంచనాలోని అసలు బలం.
క్రిస్ వుడ్ ప్రకారం బంగారం ప్రస్తుతం ఒక బలమైన బుల్ మార్కెట్ దశలో ఉంది. దీనికి ప్రధాన కారణాలుగా ఆయన మూడు అంశాలను సూచిస్తున్నారు. ఒకటి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు; రెండు, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం; మూడు, డాలర్‌పై విశ్వాసం కొంత తగ్గుతూ ప్రత్యామ్నాయ సురక్షిత ఆస్తులపై ఆసక్తి పెరగడం.
ఇక పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమైతే.. సమీప కాలంలోనే Gold ధరలు ఔన్సుకు 6,000 డాలర్ల స్థాయిని కూడా తాకవచ్చని ఎలారా క్యాపిటల్ నివేదిక అంచనా వేస్తోంది. అంటే ప్రస్తుత ధరలతో పోలిస్తే ఇది దాదాపు 10 శాతం పైగా పెరుగుదల కావచ్చు. ముడి చమురు ధరల పెరుగుదల, యుద్ధం ఎక్కవ కాలం సాగవచ్చన్న భయాలు, అలాగే పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మొగ్గు చూపడం.. ఇవన్నీ కలిసి బంగారానికి మద్దతుగా నిలుస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు యుద్ధం అనుకున్న లక్ష్యాలు చేరుకోకపోతే అనేక వారాల పాటు కొనసాగవచ్చని సూచించగా, ఇరాన్ కూడా దాడులను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తోంది. ఈ పరిణామాలన్నీ ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని మరింత పెంచుతూ.. బంగారం ధరలను దీర్ఘకాలంలో బలంగా ఉంచే అవకాశాన్ని పెంచుతున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications