మాల్యా అప్పగింత అప్పుడే కుదరదు, కేంద్రం ఏం చెప్పిందంటే
భారత బ్యాంకులకు వేలకోట్లు కుచ్చుటోపీ పెట్టి లండన్‌లో తలదాచుకుంటున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా అప్పగింతపై భారత ప్రభుత్వం.. సుప్రీం కోర్టుకు కీలక విషయాన్ని తెలిపింది. మాల్యా అప్పగింత కుదరదని బ్రిటన్ ప్రభుత్వం చెప్పినట్లు భారత అత్యున్నత న్యాయస్థానానికి వెల్లడించింది. రహస్య న్యాయపర చిక్కులు తొలగిపోయే వరకు భారత్‌కు అప్పగించలేమని బ్రిటన్ చెప్పిందని తెలిపింది.
జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట బ్రిటన్ తమకు పంపిన లేఖను కేంద్రం తరఫు న్యాయవాది చదివి వినిపించారు. అయితే తదుపరి న్యాయపరమైన అంశాలు పరిష్కారమయ్యే వరకు మాత్రమే అప్పగించడం కుదరదని బ్రిటన్ తెలిపింది. న్యాయపరమైన అంశాలు తేలాక అప్పగించే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే భారత ప్రభుత్వం ఈ మార్గంలో రప్పించే ప్రయత్నాలు చేస్తోంది.

సాధ్యమైనంత వేగంగా ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు ప్రయత్నిస్తామని బ్రిటన్ చెప్పినట్లు కేంద్రం తెలిపింది. అనంతరం మాల్యాను భారత్ రప్పించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అటార్నీ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకు వివరించారు. వాదనలు విన్న అనంతరం ఈ కేసు విచారణను మార్చి 15కు వాయిదా వేశారు.