తప్పట్లేదు, అందుకే.. ఇక ధరలు పెంచుతున్నాం..: కస్టమర్లకు వారు షాక్!
ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతోన్న విషయం తెలిసిందే. కరోనా-లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు ధరల్లో మార్పు లేదు. జూన్ 7వ తేదీ నుండి చమురు రంగ సంస్థలు ధరలను సమీక్షించడం ప్రారంభించాయి. ఈ నెల రోజుల్లో దాదాపు రూ.10 వరకు పెరిగాయి. ఇంధన ధరలు పెరగడంతో ఆ భారం వాహనదారులతో పాటు వివిధ వస్తువుల వినియోగదారులపై కూడా పడనుంది. ఎందుకంటే సరఫరా చేసే ట్రక్ యజమానులు ధరలు పెంచుతున్నారు.
కరోనా దెబ్బతో కుప్పకూలిన ఆ దేశ ఎకానమీ, శాలరీ లేక 20 రాత్రులు వీధుల్లోనే

25 శాతం వరకు పెరుగుదల
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి తోడు కరోనా కారణంగా మ్యాన్ పవర్ కొరత ఉండటంతో ట్రక్ యజమానుల కార్యకలాపాల ఖర్చులు పెరుగుతున్నాయి. దీంతో వారు కూడా ధరలను 20 శాతం నుండి 25 శాతం మేర పెంచనున్నారు. ఓ వైపు డిమాండ్ లేమి కారణంగా టారిఫ్ హైకింగ్‌కు ప్రస్తుతం అనుకూలంగా కనిపించడం లేదు. కానీ పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా పెంచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఇక ధరలు పెంచుతున్నాం..
ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా కోలుకుంటున్నాయి. పరిశ్రమలు క్రమంగా ఉత్పత్తిని పెంచుతున్నాయి. దీంతో రవాణాకు కూడా అదే విధంగా డిమాండ్ పెరుగుతోంది. కానీ రికార్డ్ స్థాయికి చేరుకుంటున్న ఇంధన ధరల కారణంగా రవాణా పరిశ్రమపై రెట్టింపు ప్రభావంపడింది. ఇప్పటికే పలుచోట్ల ట్రాన్సుపోర్టర్స్ అండ్ ట్రక్కర్స్ అసోసియేషన్ సంఘాలు ధరలను 20 శాతం నుండి 25 శాతం పెంచుతున్నట్లు తమ కస్టమర్లకు ప్రతిపాదనలు పంపించాయట.

దెబ్బ మీద దెబ్బ
ఇండోర్‌కు చెందిన ట్రాన్సుపోర్టర్ రాకేష్ తివారీ మాట్లాడుతూ.. డీజిల్ ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయని, దీంతో తాము 25 శాతం టారిఫ్ హైక్‌ను కోరుతున్నామని, ఎందుకంటే నష్టాలలో కార్యకలాపాలు నిర్వహించలేమని చెప్పారు. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా బిజినెస్ లేదని, ఇప్పుడు డీజిల్ ధరలు పెరగడంతో తమ వ్యాపారంపై మరింత దెబ్బపడిందన్నారు.

వారికి ఇష్టం లేదు..
ఇండోర్ మధ్యప్రదేశ్‌లో ప్రధాన వాణిజ్య కేంద్రం. వేలాది ట్రక్కులు ఇక్కడి నుండి సరఫరా చేస్తాయి. ఇక్కడ పెద్ద ఎత్తున చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME) ఉన్నాయి. లాక్ డౌన్ సంక్షోభం తర్వాత ధరల పెరుగుదల ప్రభావం చూపుతోందని కాబట్టి నష్టాలతో వ్యాపారం చేయలేమని, అందుకే టారిఫ్స్ పెంచుతున్నారని, మరోవైపు వినియోగదారులు కూడా డిమాండ్ లేని కారణంగా సుంకాలు పెంచేందుకు ఆసక్తి చూపించరని, ఇది ఇబ్బందికరమేనని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్సుపోర్ట్ కాంగ్రెస్ వెస్ట్ జోన్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ కల్రా చెప్పారు.

ఇప్పుడిప్పుడే రోడ్డెక్కుతున్నాయి
గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీస్, వ్యవసాయ ఉత్పత్తులు, ఎడిబుల్ ఆయిల్స్, నిత్యావసర వస్తువుల ఉత్పత్తి పెరిగిందని, డిమాండ్ కూడా పెరిగిందని, దీంతో 50 శాతం ట్రక్కులకు డిమాండ్ ఉందని చెబుతున్నారు. అలాగే తమ అద్దెలు కూడా పెరిగాయని రిటైల్ ట్రాన్సుపోర్టర్ ప్రవీణ్ అగర్వాల్ అన్నారు. చాలామంది కానీ కస్టమర్లు ధరలు పెంచేందుకు సిద్ధంగా లేరన్నారు. ట్రాన్సుపోర్టర్స్ తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.