TDS on Crypto: క్రిప్టో కరెన్సీలపై టీడీఎస్, నిబంధనలు విడుదల
క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ పైన మూలం వద్ద పన్ను కోత (TDS) విధింపుకు సంబంధించి నిబంధనలను ఆదాయపన్ను శాఖ ఖరారు చేసింది. దీని ప్రకారం టీడీఎస్ కోసం డిజిటల్ ఆస్తులను బదలీ చేసిన తేదీ, చెల్లింపు విధానాన్ని క్లియర్‌గా వెల్లడించాలి. జూలై 1వ తేదీ నుండి ఏడాదికి రూ.10,000కు మించిన క్రిప్టో ట్రాన్సాక్షన్స్ పైన 1 శాతం టీడీఎస్ విధించవలసి ఉంటుంది. దీని కోసం ఫైనాన్షియల్ బిల్లు - 2022లో సెక్షన్ 194ఎస్‌ను ప్రత్యేకంగా చేర్చారు.
కొత్త నిబంధనల అమలు కోసం అవసరమైన సవరణలను సీబీడీటీ జారీ చేసింది. టీడీఎస్ రిటర్న్స్‌ను ఫామ్ 26క్యూఈ, ఫామ్ 16ఈలో దాఖలు చేయవలసి ఉంటుందని తెలిపింది. సెక్షన్ 194ఎస్ కింద వసూలు చేసిన టీడీఎస్‌ను, ఆ ట్రాన్సాక్షన్ జరిగిన నెల ముగిసిన తర్వాత 30 రోజుల్లో ఐటీ శాఖకు జమ చేయాలి. ఈ ట్రాన్సాక్షన్‌ను నిర్వహించే వ్యక్తులు ఫామ్ 26క్యూఈలో వర్చువల్ డిజిటల్ ఆస్తుల బదలీ తేదీ, వ్యాల్యూ, చెల్లింపుల విధానం వంటివి ఫాం 26క్యూఈలో వెల్లడించాల్సి ఉంటుంది.

వర్చువల్ డిజిటల్ కరెన్సీ(VDA) లేదా క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ గురించి తెలుసుకోవడానికి ట్యాక్స్ విభాగానికి ఉపయోగపడతాయని, కానీ పన్ను చెల్లింపుదారులపై మాత్రం నిబంధనల భారం పెరుగుతుందని ఏకెఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్‌నర్ అమిత్ మహేశ్వరి అన్నారు.