భారీ లాభాల్లో ప్రారంభమై, నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
స్టాక్ మార్కెట్ శుక్రవారం స్వల్ప నష్టాల్లో లేదా ఫ్లాట్‌గా ముగిశాయి. ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ రంగ స్టాక్స్ ఒత్తిడిలో కనిపించాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ స్వల్పంగా నష్టపోయినప్పటికీ 57,200 పాయింట్లకు పైన, నిఫ్టీ 17,100 పాయింట్ల పైన ముగిసింది. ఉదయం సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్ల లాభాల్లో ప్రారంభం అయింది. మధ్యాహ్నం గం.1.30 వరకు మంచి లాభాల్లో కనిపించినప్పటికీ, ఆ తర్వాత క్రమంగా క్షీణించింది. మార్కెట్ క్లోజ్ అయ్యే అరగంటకు ముందు అంటే మధ్యాహ్నం గం.3 సమయానికి నష్టాల్లోకి వెళ్లింది. ఆ తర్వాత దాదాపు అదే స్థాయిలో ముగిసింది. ఆరంభ లాభాలు కోల్పోయాయి.
సెన్సెక్స్ 57,795.11 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,084.33 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,119.28 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,208.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,373.50 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,077.10 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 76 పాయింట్లు క్షీణించి 57,200 పాయింట్ల వద్ద, నిఫ్టీ 8 పాయింట్లు తగ్గి 17,102 పాయింట్ల వద్ద ముగిసింది.

బీఎస్ఈ 30 స్టాక్స్‌లో 15 స్టాక్స్ నష్టపోగా, మిగతా 15 లాభపడ్డాయి. ఎన్టీపీసీ 4 శాతానికి పైగా లాభపడింది. మారుతీ, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్ప్ మాత్రం రెండు శాతం నుండి మూడు శాతం వరకు నష్టపోయింది. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఎన్టీపీసీ, యూపీఎల్, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్ బ్యాంకు ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఐసీఐసీఐ బ్యాంకు, హీరో మోటో కార్ప్ ఉన్నాయి.