ప్రాఫిట్ బుకింగ్ సహా కారణాలెన్నో, సెన్సెక్స్ 500 పాయింట్లు పతనం
ముంబై: వరుసగా రెండు రోజుల పాటు భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు, నేడు (మార్చి 31 బుధవారం) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల్లోనే 1700 పాయింట్ల వరకు ఎగిసి రూ.6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద పెరిగింది. కానీ నేడు ప్రారంభ సెషన్‌లో మళ్లీ పతనమయ్యాయి. ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ భారీ నష్టాలకు కారణంగా కాగా, HDFC బ్యాంకు, HDFC స్టాక్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. నిన్న 50వేల పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్, నేడు 49,700 దిగువకు పడిపోయింది. నిఫ్టీ 14,750 పాయింట్ల దిగువన ట్రేడ్ అవుతోంది.

సెన్సెక్స్ 500 పాయింట్లు డౌన్
సెన్సెక్స్ నేడు 50,049.12 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,050.32 వద్ద గరిష్టాన్ని, 49,561.86 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11 సమయానికి సెన్సెక్స్ 500 పాయింట్లు పైకి, కిందకు కదలాడింది. నిఫ్టీ 14,811.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,813.75 వద్ద గరిష్టాన్ని, 14,703.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ -507.32 (1.01%) పాయింట్లు పడిపోయి 49,627 పాయింట్ల వద్ద, నిఫ్టీ 123.30 (0.83%) పాయింట్లు క్షీణించి 14,721 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో గెయిల్ 2.72 శాతం, టాటా మోటార్స్ 2.58 శాతం, టాటా స్టీల్ 2.34 శాతం, UPL 2.24 శాతం, హిండాల్కో 2.07 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HDFC బ్యాంకు 3.87 శాతం, HDFC 3.52 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.62 శాతం, ICICI బ్యాంకు 1.98 శాతం, కోల్ ఇండియా 1.65 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, టాటా మోటార్స్, HDFC బ్యాంకు, రిలయన్స్, యూపీఎల్ ఉన్నాయి.

ప్రాఫిట్ బుకింగ్ సహా కారణాలు
కరోనా కేసులు మళ్లీ పెరగడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేసింది. లాక్ డౌన్ ఆంక్షలు వివిధ ప్రాంతాల్లో పెరగడం మార్కెట్‌ను దెబ్బతీసింది. రెండు రోజుల్లోనే మార్కెట్లు భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్లు తదుపరి కరోనా భయాలతో ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపారు. నిక్కీ, కోస్పీ, షాంఘై కాంపోజిట్ సహా ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. ఈ ప్రభావం కూడా కనిపించింది.