Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?
ప్రస్తుతం భారతదేశం తీవ్రమైన ఎల్‌పీజీ, ఇంధన సరఫరా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా సముద్ర మార్గాలు మూతపడి, చమురు దిగుమతులు నిలిచిపోయాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశంలోని ఇంధన వనరులను ఆదా చేయడానికి 'వర్క్ ఫ్రమ్ హోమ్' (Work from home) ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం అవుతుందని వెల్స్ ఫార్గో (Wells Fargo) వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ కటకం అభిప్రాయపడ్డారు.
చంద్రశేఖర్ తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో పేర్కొన్న ప్రకారం.. ప్రతిరోజూ లక్షలాది మంది ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడానికి వాహనాల్లో ప్రయాణిస్తూ భారీగా ఇంధనాన్ని ఖర్చు చేస్తున్నారు. ఒకవేళ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from home) సౌకర్యం కల్పిస్తే.. ఆ మిగిలిన ఇంధనాన్ని అత్యవసర సేవలకు (హెల్త్‌కేర్, ఎమర్జెన్సీ రెస్పాన్స్, లాజిస్టిక్స్) మళ్లించవచ్చు. ఇది కేవలం వ్యాపార నిర్ణయం మాత్రమే కాదని, ప్రస్తుతం ఉన్న సంక్షోభ సమయంలో ఇది ఒక సామాజిక బాధ్యత (CSR) అని ఆయన పేర్కొన్నారు.

దేశంలో ఎల్‌పీజీ పరిస్థితి ఆందోళనకరం
భారతదేశం తన ఎల్‌పీజీ అవసరాల కోసం 62-67 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఇందులో దాదాపు 85-90 శాతం సరఫరా హార్ముజ్ జలసంధి గుండానే జరుగుతుంది. యుద్ధం వల్ల ఈ మార్గం మూతపడటంతో వాణిజ్య సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ ధర మార్చి 7న ఏకంగా ₹144 పెరిగి ₹1,880 దాటింది. గృహ అవసరాలకు వాడే సిలిండర్ల ధర కూడా ₹60 పెరిగింది. ముంబై వంటి నగరాల్లో ఇప్పటికే 20 శాతం రెస్టారెంట్లు మూతపడ్డాయి.
ప్రభుత్వ చర్యలు.. ప్రత్యామ్నాయాలు..
పరిస్థితిని అదుపు చేయడానికి భారత ప్రభుత్వం నిత్యావసర వస్తువుల చట్టం, 1955ను ప్రయోగించింది. గ్యాస్ నిల్వలను పెంచాలని దేశీయ రిఫైనరీలను ఆదేశించింది. గల్ఫ్ దేశాలపై ఆధారపడటం తగ్గించి అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా వంటి దేశాల నుండి గ్యాస్ తెప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం మన దగ్గర 25-30 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
మిశ్రమ స్పందనలు
చంద్రశేఖర్ ప్రతిపాదనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from home) వల్ల ట్రాఫిక్ తగ్గి దేశానికి మేలు జరుగుతుందని అంటుంటే.. మరికొందరు దీనివల్ల ప్రభుత్వానికి పెట్రోల్ పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే యుద్ధం ముగిసి శాంతి నెలకొంటే తప్ప ఈ 'డోమినో ఎఫెక్ట్' తగ్గదని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.
ఏది ఏమైనా దేశం ఇలాంటి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఇంధనాన్ని పొదుపు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. బండిలో పెట్రోల్ నుంచి ఇంట్లో వాడే వంట గ్యాస్ వరకూ ప్రతి ఒక్కరూ పొదుపుగా వాడడం ఇప్పుడు ఎంతైనా అవసరం.


Click it and Unblock the Notifications