Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అప్పుడప్పుడు ఎదురవుతున్న గ్యాస్ కొరత (LPG Shortage), ఆకాశాన్నంటుతున్న సిలిండర్ ధరలు (LPG Prices) సామాన్యులను కలవరపెడుతున్నాయి. గ్యాస్ సిలిండర్ ధర పెరిగినప్పుడల్లా మధ్యతరగతి కుటుంబాలు బడ్జెట్ లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది. అయితే ఇలాంటి సమస్యలన్నింటికీ స్వస్తి చెబుతూ బెంగళూరు (Bengaluru)కు చెందిన రేవా, రంజన్ మాలిక్ దంపతులు ఒక సరికొత్త మార్గాన్ని చూపించారు. ఆధునిక సౌకర్యాలకు దూరంగా ఉంటూనే, పర్యావరణానికి మేలు చేసే విధంగా వారు నిర్మించుకున్న ఇల్లు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

గ్యాస్ సిలిండర్ లేని వంటగది
రేవా, రంజన్ తమ ఇంట్లో వంట కోసం ఎల్‌పీజీపై అస్సలు ఆధారపడరు. గ్యాస్ గురించి వారు ఎప్పుడూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు సోలార్ కుక్కర్ , పొగ రాని వినూత్నమైన పొయ్యిని (Smokeless Chulha) ఉపయోగిస్తారు. సోలార్ కుక్కర్ ద్వారా సూర్యరశ్మితో ఆహారాన్ని వండటం వల్ల గ్యాస్ ఖర్చు మిగలడమే కాకుండా ఆహారంలోని పోషకాలు కూడా అలాగే ఉంటాయి. ఇక వర్షాకాలంలో లేదా ఎండ తక్కువగా ఉన్నప్పుడు పొగ రాని పొయ్యి ద్వారా వంట పూర్తి చేస్తారు.
5 శాతం కంటే తక్కువ సిమెంటుతో మట్టి ఇల్లు
వీళ్లు బెంగళూరు వంటి మెట్రో సిటీలో నివసిస్తున్నా.. వీరి లైఫ్ స్టైల్ మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. వీరు నివసించే ఇల్లు సాధారణ కాంక్రీట్ భవనం కాదు. ప్రకృతిలో లభించే సహజ సిద్ధమైన మెటీరియల్‌తో, కేవలం 5 శాతం కంటే తక్కువ సిమెంటును మాత్రమే వాడి ఈ మట్టి ఇంటిని నిర్మించారు. టెర్రాకోట కూలింగ్ టెక్నాలజీని వాడటం వల్ల ఎండాకాలంలో కూడా ఏసీలు, కూలర్లు అవసరం లేకుండా ఇల్లు ఎంతో చల్లగా ఉంటుంది. పగటిపూట లైట్లు వాడాల్సిన అవసరం లేకుండా సహజమైన కాంతి వచ్చేలా ఇంటి డిజైన్ రూపొందించుకున్నారు. దీనివల్ల విద్యుత్ బిల్లులు కూడా భారీగా తగ్గుతాయి.
వర్షపు నీరే జీవనాధారం
బెంగళూరు (Bengaluru) వంటి నగరాల్లో ఉండే నీటి సమస్య వీరికి అస్సలు లేదు. ఎందుకంటే.. వీరు మున్సిపల్ నీటి సరఫరాపై కూడా ఆధారపడరు. ప్రతి సంవత్సరం దాదాపు 50,000 లీటర్ల వర్షపు నీటిని సేకరించి (Rainwater Harvesting), దానినే వడపోసి తాగునీటిగా, ఇంటి అవసరాలకు వాడుకుంటారు. అలాగే ఇంట్లో వాడిన నీటిని కూడా వృధా చేయకుండా రీసైకిల్ చేసి మొక్కలకు ఉపయోగిస్తారు. ఇలా ప్రకృతిని గౌరవిస్తూ వారు సాగిస్తున్న జీవనం నేటి తరం యువతకు ఒక గొప్ప పాఠం.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత నడుస్తోంది. ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం ప్రభుత్వంపై ఆధారపడతాం. కానీ, ఈ దంపతులు చూపిన మార్గం ఏంటంటే.. మనం కాస్త ఆలోచిస్తే మనకు కావాల్సిన ఇంధనాన్ని, నీటిని మనమే సమకూర్చుకోవచ్చని. సుస్థిర జీవనం అంటే విలాసాలకు దూరం కావడం కాదు. తెలివైన డిజైన్ తో ప్రకృతితో కలిసి జీవించడం అని వీరు నిరూపించారు.


Click it and Unblock the Notifications