భారతీయ స్టాక్ మార్కెట్ (Stock market) శుక్రవారం ఉదయం సెషన్‌లోనే భారీ నష్టాలను చవిచూసింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ మేఘాలు, ముడి చమురు ధరల పెరుగుదల , రూపాయి విలువ పతనం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉదయం 10:20 గంటల సమయానికి బిఎస్‌ఇ సెన్సెక్స్ ఏకంగా 910 పాయింట్లు పడిపోయి 75,114 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 315 పాయింట్లు కోల్పోయి 23,350 మార్కు దిగువకు చేరింది. కేవలం పెద్ద కంపెనీలే కాకుండా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా 2 శాతం పైగా నష్టపోయాయి.
మార్కెట్ పతనానికి దారితీసిన కీలక అంశాలను ఇప్పుడు వివరంగా చూద్దాం..

1. ఆకాశాన్ని తాకుతున్న ముడి చమురు ధరలు
పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రతరం కావడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటేశాయి. హార్ముజ్ జలసంధి గుండా సరఫరా నిలిచిపోతుందనే భయాలు మార్కెట్ ను కలవరపెడుతున్నాయి. అయితే, రష్యా నుంచి సముద్రంలో చిక్కుకుపోయిన చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా 30 రోజుల వెసులుబాటు కల్పించడం కొంత ఊరటనిచ్చినా, ధరల పెరుగుదల మాత్రం ఆగడం లేదు.
2. చారిత్రక కనిష్టానికి రూపాయి విలువ
మరోవైపు అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ దారుణంగా పడిపోతోంది. శుక్రవారం ట్రేడింగ్‌లో రూపాయి 12 పైసలు తగ్గి 92.37 వద్ద ఆల్ టైమ్ లో రికార్డు సృష్టించింది. చమురు ధరలు పెరగడం , విదేశీ పెట్టుబడిదారులు మన మార్కెట్ నుంచి వెనక్కి వెళ్లడం రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది.
3. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం
ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ చేసిన ప్రకటనలు మార్కెట్లను భయపెడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌లపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఆయన హెచ్చరించడం ప్రపంచ ఇంధన సరఫరాకు ముప్పుగా మారింది. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లు అన్నీ డీలా పడ్డాయి.
4. ఆగని ఎఫ్ఐఐల అమ్మకాలు
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత మార్కెట్ల నుంచి నిరంతరం తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. గురువారం ఒక్కరోజే వీరు రూ. 7,049 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. మార్చి నెలలో ఇప్పటివరకు రూ. 39,000 కోట్లకు పైగా పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. ఈ భారీ అమ్మకాల ఒత్తిడి వల్ల బ్లూచిప్ కంపెనీల షేర్లు కూడా కుప్పకూలుతున్నాయి.
5. గ్లోబల్ మార్కెట్ల ప్రభావం
అమెరికా మార్కెట్లు అయిన నాస్డాక్, ఎస్ అండ్ పి 500 కూడా గురువారం 1.5 శాతం కంటే ఎక్కువ నష్టపోయాయి. అంతర్జాతీయంగా సెంటిమెంట్ బలహీనంగా ఉండటం మన మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
ఏది ఏమైనా మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఫార్మా రంగం (Pharmaceuticals) ఒక్కటే కొంత సురక్షితంగా కనిపిస్తోంది. రూపాయి విలువ తగ్గడం ఫార్మా ఎగుమతులకు లాభదాయకంగా మారుతోంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఇన్వెస్టర్లు భయపడి షేర్లను విక్రయించకుండా, ప్రశాంతంగా ఉండి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా పెట్టుబడులను కొనసాగించడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications