ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు, ఆద్యంతం ఉగిసలాటలో...
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (ఏప్రిల్ 6) అతి స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమై, మధ్యాహ్నం నష్టాల్లోకి ఆ తర్వాత తిరిగి పుంజుకుంది. అయినప్పటికీ 42 పాయింట్ల లాభంతో ముగిసింది. మధ్యాహ్నం ఒకటి తర్వాత నష్టాల్లోకి వెళ్లి, అంతలోనే పుంజుకుంది. రోజంతా ఊగిసలాటలో కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుండి అందిన సానుకూల ఫలితాలు మార్కెట్లకు అండగా నిలిచాయి. దేశీయంగా కరోనా కేసుల విజృంభన, కఠిన ఆంక్షల అమలు సూచీలను ఆందోళనకు గురి చేశాయి. అందుకే ఇన్వెస్టర్లు ప్రారంభంలో ప్రాఫిట్ బుకింగ్ వైపు మొగ్గు చూపారు. దీంతో సూచీలు పైకీ, కిందకు కదలాడాయి.

సెన్సెక్స్ స్వల్ప లాభాల్లో
మెటల్, ఫార్మా రంగాలు దాదాపు ఒక శాతం మేర ఎగిశాయి. బ్యాంకింగ్ స్టాక్స్‌లో చాలా వరకు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.8 శాతం నుండి 1 శాతం మేర లాభపడ్డాయి. సెన్సెక్స్ 49,441.13 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,582.26 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,936.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 14,737.00 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,779.10 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,573.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 42.07 (0.086%) పాయింట్లు ఎగిసి 49,201.39 పాయింట్ల వద్ద, నిఫ్టీ 45.70 (0.31%) పాయింట్లు లాభపడి 14,683.50 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 12.57 శాతం, టాటా కన్స్.ప్రోడ్. 4.59 శాతం, ఏషియన్ పేయింట్స్ 4.02 శాతం, JSW స్టీల్ 3.86 శాతం, SBI లైఫ్ ఇన్సురా 2.87 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.31 శాతం, ఐచర్ మోటార్స్ 1.22 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.08 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.07 శాతం, గ్రాసీమ్ 0.96 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, జేఎస్‌డబ్ల్యు స్టీల్ ఉన్నాయి.

రంగాలవారీగా
పారిశ్రామిక, మౌలిక, FMCG, రియాల్టీ, లోహ, టెలికాం రంగాల షేర్లు లాభాల్లో పయనించాయి. బ్యాంకింగ్, PSU బ్యాంకింగ్,, ఇంధన రంగం షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 50లో అదానీ పోర్ట్స్ షేర్లు ఏకంగా 12.57 శాతం ఎగిశాయి. టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, ఏషియన్ పెయింట్స్, JSW స్టీల్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి.