జియో ప్లాట్‌ఫాంలోకి సౌదీ అరేబియా వెల్త్ ఫండ్ కంపెనీ
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ డిజిటల్ అనుబంధ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరో కంపెనీ పెట్టుబడులు పెట్టనుంది. సౌదీ అరేబియాకు చెందిన వెల్త్ ఫండ్.. పబ్లిక్ ఇన్వెస్టుమెంట్ ఫండ్ (PIF) 1.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసి 2.33 శాతం వాటాను దక్కించుకోనుందని తెలుస్తోంది. ఈ పెట్టుబడి కూడా వస్తే జియో ప్లాట్‌ఫామ్స్‌లో రిలయన్స్ వాటా దాదాపు 25 శాతం వాటా తగ్గనుంది.
2021 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రుణరహిత కంపెనీగా తీర్చిదిద్దాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే తొమ్మిది కంపెనీలు పదిసార్లు (ఒక కంపెనీ రెండోసారి పెట్టుబడి పెట్టింది) ఇన్వెస్ట్ చేశాయి. దీంతో దాదాపు 23 శాతం వాటాను విక్రయించింది రిలయన్స్. ఇప్పటికే అబుదాబికి చెందిన ముబాదాల, ఏడీఐఏలు వరుసగా 1.2 బిలియన్ డాలర్లు, 750 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి.

ఇప్పటి వరకు జియో ప్లాట్‌ఫామ్స్‌లో 22.38 శాతం వాటాను విక్రయించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ వాటా విక్రయాల ద్వారా రూ.1,04,326.90 కోట్లు సమీకరించింది. ఏప్రిల్ 22న ఫేస్‌బుక్ - జియో డీల్‌తో ఈ పెట్టుబడుల రాకడ ప్రారంభమైంది. జియో ప్లాట్‌ఫాంలో మరో ఏడు నుండి 8 శాతం విక్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- ఫేస్‌బుక్ - రూ.43,573.62 కోట్లు - 9.99 శాతం వాటా
- సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ - రూ.5,655.75 కోట్లు - 1.15 శాతం వాటా
- విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా
- జనరల్ అట్లాంటిక్ - రూ.6,598.38 కోట్లు - 1.34 శాతం వాటా
- కేకేఆర్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా
- ముబాదాల - రూ.9,093.60 కోట్లు - 1.85 శాతం వాటా
- సిల్వర్ లేక్ (రెండోసారి) - రూ.4,546.80 కోట్లు - 0.93 శాతం వాటా
- ADIA - రూ.5,683.50 కోట్లు - 1.16 శాతం వాటా
- TPG - రూ.4,546.8 కోట్లు - 0.93 శాతం వాటా
- ఎల్-కేటర్టన్ - రూ.1,894.50 కోట్లు - 0.39 శాతం వాటా


Click it and Unblock the Notifications