డాలర్ మారకంతో బలహీనం... 20 పైసలు క్షీణించిన రూపాయి
అమెరికా డాలర్‌తో దేశీయ కరెన్సీ రూపాయి మంగళవారం నష్టాల్లో ముగిసింది. కరోనా కేసులు పెరుగుతుండటం, యూరోపియన్ దేశాలు లాక్ డౌన్ ఆలోచనతో ఉండటంతో ప్రపంచ, దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా కుప్పకూలుతున్నాయి. ఈ నేపథ్యంలో డాలర్ మారకంతో రూపాయి ఈ రోజు 20 పైసలు క్షీణించి 73.58 వద్ద క్లోజ్ అయింది. ఉదయం 73.50 వద్ద బలహీనంగా ట్రేడింగ్‌ను ప్రారంభించిన మార్కెట్, ఆ తర్వాత పతనమై 74.64 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. డాలర్ మారకంతో సోమవారం రూపాయి 7 పైసలు లాభపడి, 73.38 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు 20 పైసలు క్షీణించి 73.58 వద్ద ముగిసింది.
స్టాక్ మార్కెట్లు మంగళవారం (సెప్టెంబర్ 22) భారీ నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. ఉదయం ఓ సమయంలో 500 పాయింట్ల నష్టాల్లోకి వెళ్లిన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాన్ని తగ్గించుకుంది. సెన్సెక్స్ 300 పాయింట్లు క్షీణించి 37,734.08 పాయింట్ల వద్ద, నిఫ్టీ 97 పాయింట్లు నష్టపోయి 11,153.65 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ 38వేల దిగువకు వచ్చింది.

బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.70 శాతం, 1.61 శాతం మేర నష్టపోయాయి. బీఎస్ఈ ఐటీ టెక్, ఫార్మా రంగాలు మినహా మిగతా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి. రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, కాపిటల్ గూడ్స్ అండ్ ఇండస్ట్రియల్ రంగాలు దాదాపు రెండు శాతం మేర నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.58 వద్ద క్లోజ్ అయింది.