RBI: ఫిన్ టెక్ కంపెనీల క్రెడిట్ లైన్ కు రిజర్వు బ్యాంక్ ఎందుకు అడ్డుకట్ట వేసింది..? అసలు మ్యాటర్ ఏమిటంటే..
RBI On Fintechs: నాన్-బ్యాంకు ప్రీపెయిడ్ వాలెట్లు, ప్రీపెయిడ్ కార్డ్‌లకు క్రెడిట్ లైన్లను లోడ్ చేయడానికి నిరాకరిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నోటిఫికేషన్ విడుదల చేసింది. Fintech క్రెడిట్ ఆఫర్‌ను నిలుపుదల చేసింది. అంటే అమెజాన్ పే వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఎలాంటి క్రెడిట్ లైన్‌ను అందించలేవు. క్రెడిట్ సాధనాల్లో బలమైన బూమ్ ఉన్నందున రిజర్వ్ బ్యాంక్ ఈ నిబంధనను తీసుకురావాల్సి వచ్చింది.
అనేక ఫిన్‌టెక్ కంపెనీలు క్రెడిట్ కార్డ్‌లను అందిస్తున్నాయి. అనేక వాలెట్లు బయ్ నౌ- పే లేటర్ సౌకర్యాన్ని అందించడం ప్రారంభించాయి. ఇప్పుడు ఇందులో చాలా మందికి ఉండే అనుమానం.. దీనివల్ల సమస్య ఏంటి అన్నదే. దీని వల్ల కస్టమర్లకు ఏమైనా నష్టం జరుగుతుందా లేక ఏదైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందా? అనే అంశాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

ముందుగా ఆర్బీఐ నోటిఫికేషన్‌లో ఏం చెప్పిందో అర్థం చూద్దాం..
ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPI)పై దాని మాస్టర్ డైరెక్షన్ క్రెడిట్ లైన్ నుంచి PPIలను లోడ్ చేయడానికి అనుమతించబోమని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ విధానాన్ని అనేక ఫిన్‌టెక్ క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఫ్లోలో అవుతున్నాయి. ఈ ఫిన్ టెక్ కంపెనీలు బ్యాంకుల, NBFCలతో టై-అప్ అయ్యి.. వారి ప్రీపే వాలెట్ల ద్వారా వినియోగదారులకు ముందుగా నిర్ణయించిన కొంత మెుత్తంలో క్రెడిట్ లైన్లను అందిస్తాయి. రిజర్వ్‌బ్యాంకు వెంటనే ఇలాంటి విధానానికి స్వస్తి చెప్పాలని తెలిపింది. దీన్ని పాటించకపోతే పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం- 2007ని ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడే సంస్థలపై జరిమానాలు విధించవచ్చని తెలుస్తోంది.

PPIలు అంటే ఏమిటి?
PPI అంటే ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్. రిజర్వు బ్యాంక్ ప్రకటన తరువాత అసలు పీపీఐ అంటే ఏమిటి అనే విషయంలో గందరగోళం ఏర్పడింది. ఇవి ఒక ఉత్పత్తి లేదా సేవను కొనుగోలు చేసే చెల్లింపు సాధనాలు. ఇది నిధుల బదిలీ, ఆర్థిక సేవలు, డబ్బు అభ్యర్థన కోసం ఉపయోగించవచ్చు. PPIలు పేమెంట్ వాలెట్లు, స్మార్ట్ కార్డ్‌లు, మొబైల్ వాలెట్లు, మాగ్నెటిక్ చిప్స్, వోచర్‌లు మొదలైన వాటి రూపంలో మార్కెట్లో ఉన్నాయి. బ్యాంకులు, NBFCలు నిబంధనల ప్రకారం PPIలను జారీ చేయవచ్చు.

రిజర్వ్ బ్యాంక్ పేర్కొన్న క్రెడిట్ లైన్ ఏమిటి?
క్రెడిట్ లైన్ అనేది ఒక రకమైన లోన్ సౌకర్యం. ఇది ముందుగా నిర్ణయించిన పరిమితిని కలిగి ఉంటుంది. ముందుగా ఆమోదించబడిన లోన్ అని చెప్పవచ్చు. దీన్ని ఉపయోగించి.. ఏ వ్యక్తి అయినా లేదా వ్యాపారం అయినా ఎప్పుడైనా క్రెడిట్ తీసుకోవచ్చు. అంటే.. మీకు డబ్బు అవసరమైనప్పుడు, మీరు దాన్ని యాక్సెస్ చేయవచ్చు. ఆ డబ్బుతో మీ పనిని పూర్తిచేసుకోవచ్చు. ఒక వ్యక్తి లేదా వ్యాపారం అతని పరిమితికి లోబడి తనకు అందించిన క్రెడిట్ లైన్ నుంచి డబ్బు తీసుకోవచ్చు. ఇది ఒక రకమైన ఫ్లెక్సిబుల్ లోన్ అని చెప్పుకోవాలి.

రిజర్వ్ బ్యాంక్ ఈ నోటిఫికేషన్ ఎందుకు జారీ చేయాల్సి వచ్చింది?
మార్కెట్‌లో క్రెడిట్ ఉత్పత్తులు వేగంగా పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ దానికి సంబంధించిన కొన్ని నియమాలను కూడా రూపొందించింది. కొన్ని ఫిన్‌టెక్ కంపెనీలు.. SBM బ్యాంక్, RBL బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ వంటి బ్యాంకులతో టైఅప్ చేసుకుంటే, మరికొన్ని ఫిన్‌టెక్ కంపెనీలు NBFCలతో టైఅప్ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో fintechకు సంబంధించిన NBFC భాగస్వామి ద్వారా క్రెడిట్ లైన్ కూడా పొడిగించడం జరిగింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ డిజిటల్ స్పేస్ ను నియంత్రించే నిబంధనలను ఆర్‌బీఐ త్వరలో అమలు చేయనున్నట్లు చెప్పారు.

ఏఏ ఫిన్‌టెక్ కంపెనీలు క్రెడిట్ ఉత్పత్తులను అందిస్తున్నాయి?
ప్రస్తుతం.. చాలా ఫిన్‌టెక్ కంపెనీలు తమ ప్రధాన ఉత్పత్తితో పాటు క్రెడిట్ లైన్ ను అందిస్తున్నాయి. Paytm, Amazon Pay, LazyPay, Simple మొదలైన కంపెనీలు చిన్న క్రెడిట్ లైన్‌తో పోస్ట్‌పెయిడ్ వాలెట్‌లను అందిస్తున్నాయి. మరోవైపు.. Slice, Uni, Fi, OneCard వంటి కంపెనీలు బ్యాంకులు, NBFCల భాగస్వామ్యంతో క్రెడిట్ కార్డులను కూడా జారీ చేస్తున్నాయి.

దీనిపై అసలు ప్రజలు ఏమనుకుంటున్నారంటే..
క్రెడిట్ లైన్లను లోడ్ చేయకుండా ఫిన్‌టెక్ కంపెనీలపై రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించడంపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందులో తప్పేముంది అని సోషల్ మీడియాలో కొంత మంది ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు. పెద్ద సంస్థల ఫిర్యాదుతోనే ఇదంతా జరుగుతోందని, ఈ కొత్త చిన్న ఆటగాళ్లు తమ మార్కెట్‌ను పాడు చేసుకోవడం వల్ల లాభాలు తగ్గిపోతున్నాయని మరికొందరు భావిస్తున్నారు. సరే.. కారణం ఏదైనా సరే.. కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇదంతా చేస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఏమైనప్పటికీ.. బయ్ నౌ- పే లేటర్ వంటి సౌకర్యాలు ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో లేవు. ఇది ఇకపై నియంత్రించబడుతుంది. ఈ రకమైన క్రెడిట్ లైన్లన్నింటినీ నియంత్రించే లక్ష్యంతో UPIతో క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేసే వెసులుబాటును అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయంలో సదరు ఫిన్ టెక్ కంపెనీలు వారు టై అప్ అయిన బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నాయి. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం కూడా తీసుకుంటాయని తెలుస్తోంది.