రూ.82 దాటిన లీటర్ పెట్రోల్ ధర... వరుసగా ఎనిమిదో రోజు పెరుగుదల..
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం(నవంబర్ 29) లీటర్ పెట్రోల్ ధర 24 పైసలు పెరిగి రూ.82కి చేరింది. లీటర్ డీజిల్ ధర 27 పైసలు పెరిగి రూ.72కి చేరింది. గత తొమ్మిదిరోజుల్లో ఇంధన ధరలు పెరగడం ఇది ఎనిమిదోసారి. అంతకుముందు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.82.13 ఉండగా... డీజిల్ ధర 71.86గా ఉంది.
గత తొమ్మిది రోజుల్లో లీటర్ పెట్రోల్ మొత్తంగా రూ1.07 పెరిగింది. అలాగే డీజిల్ రూ.1.67 పెరిగింది. అంతకుముందు సెప్టెంబర్ 22 నుంచి నవంబర్ 20 వరకూ పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అక్టోబర్ 2 నుంచి నవంబర్ 20 వరకూ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్,భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్,హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ కంపెనీలు అంతర్జాతీయ చమురు ధరలకు తగినట్లుగా ప్రతీరోజూ ధరలను సవరిస్తున్నాయి.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళించినప్పటి నుంచి రిటైల్ ధరల్లో నెలకొన్న అస్థిరతను నివారించే ఉద్దేశంతో చమురు కంపెనీలు ధరలను క్రమబద్దీకరిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.88.58 నుంచి రూ.88.81కి పెరిగింది. డీజిల్ ధర రూ.78.38 నుంచి రూ.78.66గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.85.12 ఉండగా... లీటర్ డీజిల్ ధర రూ.77.56గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.67గా ఉండగా... లీటర్ డీజిల్ ధర రూ.75.70గా ఉంది. ఆయా రాష్ట్రాల వ్యాట్ ఆధారంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ధరలు ఉండనున్నాయి.