సుప్రీం కోర్టు తీర్పు నిరాశపరిచింది, అందరికీ థ్యాంక్స్: సైరస్ మిస్త్రీ
టాటా సన్స్ కార్పోరేట్ వివాదంలో టాటాలకు అనుకూలంగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు చెప్పడంపై సైరస్ మిస్త్రీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తనను వ్యక్తిగతంగా తీవ్రంగా నిరాశకు గురి చేసిందన్నారు. సుప్రీం తీర్పు నిరుత్సాహపరిచిందని, అయితే తన మనస్సాక్షి స్పష్టంగానే ఉందని, తనకు మద్దతిచ్చిన అందరికీ కృతజ్ఞతలు అన్నారు.
ఇండియన్ హిస్టరీలోనే అతిపెద్ద డేటా లీక్, మొబిక్విక్ ఏం చెప్పిందంటే?

ఎలాంటి అనుమానాల్లేవు
టాటా సన్స్ ఛైర్మన్‌గా తనను తిరిగి నియమించాలని NCLT జారీ చేసిన ఆదేశాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. తన పదవీ కాలంలో తీసుకున్న చర్యలపై ఎలాంటి అనుమానాలు లేవని, తన అంతరాత్మ స్పష్టంగానే ఉందన్నారు సైరస్ మిస్త్రీ. సమాజంలోని ప్రతి వ్యక్తి తన చర్యలు, విశ్వాసాలకు కోర్టుల వంటి వ్యవస్థల్లో సముచిత స్థానం దక్కుతుందని చూస్తుంటారని, టాటా సన్స్‌లో మైనార్టీ వాటాదారుగా, వ్యక్తిగతంగా కోర్టు తీర్పు తనను నిరుత్సాహపరిచిందన్నారు.

ఆ ప్రభావం ఉంటుంది
టాటా గ్రూప్ పాలనా దిశను తాను నేరుగా ప్రభావితం చేయలేను కానీ, తాను లేవదీసిన అంశాల ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు. అది ఇతరుల్లో మార్పు తీసుకు వస్తుందని, తన వరకు తాను ప్రశాంతంగా ఉండగలనని చెప్పారు. జీవితం ఎప్పుడూ మన వైపు ఉండదని, తాను ఎప్పుడూ అదృష్టవంతుడినేనని, తన కుటుంబం, స్నేహితులు, సహచరులు గతంలో, ఇప్పుడు తనకు అండగా నిలిచారని, ఈ ప్రయాణంలో తనకు తోడు నిలిచిన వారందరికీ థ్యాంక్స్ అన్నారు.

వారు మెచ్చుకున్నారు
గత నాలుగేళ్లుగా తన చర్యలపై స్పందించేందుకు అవకాశం దక్కిందని, నాయకత్వ మార్పు జరిగినప్పుడు బలమైన నిర్ణయాత్మక వ్యవస్థ, వ్యక్తికి మించిన పాలన ఉండాలని భావించానని సైరస్ మిస్త్రీ అన్నారు. డైరెక్టర్లు ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా వ్యవహరించేలా చూశానని, టాటా సన్స్ వాటాదారుల విలువను రక్షించేలా ఏర్పాటు చేయాలని భావించానని, తన పని తీరును బోర్డుల్లోని యాభై శాతం వరకు స్వతంత్ర డైరెక్టర్లు మెచ్చుకున్నారన్నారు.