మార్కెట్ మహా పతనం, కారణాలివే: సెన్సెక్స్ 1700 పాయింట్లు డౌన్
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 12) కుప్పకూలాయి. కరోనా భయాలు పెరగడంతో సూచీలు నేడు క్షీణించాయి. కరోనా కేసులు రోజురోజుకు పెరగడం, మహారాష్ట్రలో బుధవారం నుండి లాక్ డౌన్ విధించనున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ట్రేడింగ్ ఆరంభం నుండి మార్కెట్లు నష్టాల్లోనే ఉన్నాయి. సెన్సెక్స్ నేడు 1700 పాయింట్లకు పైగా నష్టాల్లో ముగియడంతో నేడు ఇన్వెస్టర్ల సంపద రూ.8 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. ప్రభుత్వరంగ బ్యాంకులు తొమ్మిది శాతానికి పైగా కుంగిపోయాయి. ఆటో, ఎనర్జీ,ఇన్ఫ్రా, మెటల్ రంగ షేర్లు నాలుగు శాతం నుండి ఐదు శాతం నష్టపోయాయి.

సూచీలు పతనం
సెన్సెక్స్ నేడు ఉదయం 48,956.65 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,956.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 47,693.44 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. క్రితం సెషన్లో 49,591 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నేడు ఏ సమయంలోను నిన్నటి మార్కును తాకలేదు. చివరకు 1,707.94 (3.44%) పాయింట్లు నష్టపోయి 47,883.38 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,644.65 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,652.50 వద్ద గరిష్టాన్ని, 14,248.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 524.05 (3.53%) పాయింట్లు నష్టపోయి 14,310.80 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

అందుకే మార్కెట్ పతనం
నేడు రికార్డ్ స్థాయిలో 1.69 లక్షల కరోనా కేసులు నమోదు కావడంతో మార్కెట్లు బెంబేలెత్తాయి. ప్రపంచంలోని ప్రతి ఆరు కేసుల్లో ఒకటి భారత్‌లో నమోదుకావడం ఆందోళనకు కారణమైంది. 2021లో ఇది అత్యధికం. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. ఇవి ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించే విషయంలో బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్లు వచ్చిన వార్తలు ఇన్వెస్టర్లను భయానికి గురి చేశాయి. ఆసియా మార్కెట్లు కూడా పతనమయ్యాయి. ఈ ప్రభావం కూడా పడింది.

FPIలు వెనక్కి
ఏప్రిల్ నెలలో ఇప్పటి వరకు FPI ఇన్వెస్టర్లు దాదాపు రూ.929 కోట్లను నికరంగా విక్రయించారు. ఆర్థిక వ్యవస్థ తిరిగి పింజుకోవడంపై ఆందోళనలు నెలకొన్నాయి. 9వ తేదీ వరకు ఈక్విటీల నుండి రూ.740 కోట్లు, డెట్ మార్కెట్ నుండి రూ.189 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ప్రధానంగా బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. లాక్ డౌన్ విధిస్తే ఎన్పీఏలు మరింత పెరుగుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లను భయానికి గురి చేసింది.