కొత్త నిబంధన చిక్కు, వాట్సాప్‌కు పోటీగా.. 'యూజ్ సిగ్నల్': ఎలాన్ మస్క్ ట్వీట్
వాట్సాప్ ఇటీవల కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలను తీసుకు వచ్చింది. కొత్తగా తీసుకు వచ్చిన నిబంధనలను అంగీకరించని పక్షంలో వారి మొబైల్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నెల రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 8వ తేదీ నుండి పని చేయదని పేర్కొంది. ఈ ప్రైవసీ పాలసీ ప్రకారం ఫేస్‌బుక్ సంబంధిత సర్వీసులతో యూజర్ డేటా పంచుకోవడం ముఖ్యమైన అంశం. యూజర్ వ్యక్తిగత సమాచారం, డిజైన్ ఇన్ఫర్మేషన్, ఐపీ అడ్రస్ తదితర వివరాలు ఫేస్‌బుక్‌తో వాట్సాప్ పంచుకుంటుంది.
ఈ ప్రకటన అనంతరం వాట్సాప్ యూజర్లు అసంతృప్తికి లోనయ్యారు. వాట్సాప్ యూజర్లు సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఇతర మెసెంజర్ యాప్స్ ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే సమయంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా ఇంక్ సీఈవో ఎలాన్ మస్క్ యూజర్లకు సిగ్నల్ యాప్ ఉపయోగించాలంటూ విజ్ఞప్తి చేశారు.

సిగ్నల్ యాప్ గురువారం ఓ ట్వీట్ కూడా చేసింది. చాలామంది కొత్తవారు మెసేజింగ్ ప్లాట్‌ఫాంలో చేరేందుకు ప్రయత్నిస్తున్నందున ధృవీకరణ కాస్త ఆలస్యమైందని సిగ్నల్ ట్వీట్ చేసింది. అంతేకాదు, ఇతరులు సిగ్నల్ ఉపయోగించేలా షేర్ చేయమంటూ గ్రూప్ లింక్‌ను షేర్ చేసింది. అయితే ఇక్కడ సిగ్నల్ యాప్ నేరుగా వాట్సాప్ పేరును ప్రస్తావించలేదు. మస్క్ కూడా 'యూజ్ సిగ్నల్' అంటూ ట్వీట్ చేశారు.