గుడ్‌న్యూస్... భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది: మూడీస్, వృద్ధి రేటు సవరణ
భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ వెల్లడించింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్థిక కార్యకలాపాలు పూర్తగా నిలిచిపోయి 2020లో జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటు 23.9 శాతం క్షీణించింది. అయితే అన్-లాక్ తర్వాత ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటున్నాయి. దీంతో పూర్తి సంవత్సరానికి జీడీపీని మూడీస్ సవరించింది. గతంలో కంటే కాస్త ఆశాజనకంగా పేర్కొంది.

9.6 శాతం నుండి 8.9 శాతానికి...
లాక్ డౌన్ నేపథ్యంలో 2020లో భారత జీడీపీ భారీగా తగ్గుతుందని గతంలో అంచనా వేసిన మూడీస్ తాజాగా ఆ గణాంకాలను సవరించింది. గ్లోబల్ మాక్రో అవుట్ లుక్ 20201-22 పేరుతో రూపొందించిన నివేదికలో ఈ ఏడాది జీడీపీ మైనస్ 8.9 శాతం క్షీణత నమోదు చేయవచ్చునని మూడీస్ అంచనా వేసింది. గతంలో మైనస్ 9.6 శాతంగా పేర్కొంది. గత అంచనాతో పోలిస్తే తాజా అంచనా మెరుగు. అంటే ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

వచ్చే ఏడాది మరింత వృద్ధి
2021 క్యాలెండర్ ఏడాదిలో జీడీపీ వృద్ధి రేటు 8.6 శాతంగా ఉండవచ్చునని మూడీస్ అంచనా వేసింది. గతంలో దీనిని 8.1 శాతంగా పేర్కొంది. అంటే వచ్చే ఏడాది వృద్ధి రేటు కూడా గత అంచనాల కంటే మెరుగ్గా అంచనా వేసింది. 2019లో భారత్ జీడీపీ వృద్ధి 4.8 శాతంగా నమోదయింది. దేశంలో రెండు నెలలకు పైగా సుదీర్ఘ లాక్ డౌన్ విధించారు. దీంతో ఈ ఏడాది మొత్తానికి వృద్ధి రేటు ప్రతికూలంగా ఉంటుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. డిసెంబర్ వరకు ప్రతి త్రైమాసికం ప్రతికూలంగానే ఉంటుందని చెబుతున్నారు.

భారీ ప్యాకేజీ...
జీ-20 ఆర్థిక వ్యవస్థల విషయానికి వస్తే 2020లో 3.8 శాతం క్షీణత నమోదు కావొచ్చునని, 2021లో 4.9 శాతం, 2022లో 3.8 శాతం మేర వృద్ధి నమోదు కావొచ్చునని మూడీస్ అంచనా వేసింది. భారత ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు రూ.30 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇది జీడీపీలో 15 శాతం. ప్రభుత్వం చర్యలు భారత వృద్ధిని వేగంగా పట్టాలు ఎక్కించే విధంగా కనిపిస్తోందని అంటున్నారు.