కారు గురించి అడిగి, 10 రోజుల్లో కొనుగోలు చేస్తున్నారు: మారుతీ సుజుకీ
దేశీయ అతిపెద్ద కారు మేకర్ మారుతీ సుజుకీ ఆన్‌లైన్ ఛానల్ ద్వారా రికార్డు స్థాయిలో 2 లక్షలకు పైగా కార్లను విక్రయించింది. ఈ సంస్థ రెండేళ్ల క్రితం ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను ప్రారంభించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 1000కి పైగా డీలర్‌షిప్స్‌ను కలిగి ఉంది. 2018లో కొత్త డిజిటల్ ఛానల్‌ను ప్రవేశపెట్టినప్పటి తర్వాత 2019 ఏప్రిల్ నుండి డిజిటల్ ఎంక్వయిరీలు మూడు రెట్లు, 2 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదు చేసినట్లు తెలిపింది కంపెనీ. ఈ డిజిటల్ ఛానల్ ద్వారా 21 లక్షలకు పైగా కస్టమర్ ఎంక్వయిరీలు నమోదు చేసినట్లు మారుతీ సుజుకీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.

10 రోజుల్లో కొనుగోలు
గూగుల్ ఆటో గేర్ షిఫ్ట్ ఇండియా 2020 రిపోర్టును ఉటంకిస్తూ 95 శాతం కొత్త కార్లు డిజిటల్ మార్గంలో ప్రభావితమైనట్లు తెలిపారు. దేశంలోని వినియోగదారులు మొదట ఆన్‌లైన్‌లో పరిశోధన చేసి, ఆ తర్వాత ఫిజికల్ డీలర్‌షిప్స్ వద్దకు కొనుగోలు కోసం వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు వెల్లడైందని, దేశంలో దాదాపు 95 శాతం కొత్త కార్లు ఇలా ప్రభావితమైనట్లు తెలిపారు. ఆన్‌లైన్ ఎక్స్‌పీరియన్స్ కస్టమర్లకు పూర్తి సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. ఆసక్తికర విషయం ఏమంటే తమ డిజిటల్ ఛానల్ ద్వారా విచారించిన కస్టమర్లు కేవలం 10 రోజుల్లోనే కారును కొనుగోలు చేస్తున్నారని శ్రీవాత్సవ తెలిపారు.

నియర్ మి సెర్చ్ పెరిగింది
డిజిటల్ మార్గంలో విచారించుకోవడం, డిజిటల్ మార్గంలో అమ్మకాలు సులభంగా మారాయని శ్రీవాత్సవ తెలిపారు. ఇందుకు తమ కార్ల సేల్స్ నిదర్శనమని పునరుద్ఘాటించారు. మారుతీ సుజుకీ డీలర్స్‌ను వెతకడం కోసం కస్టమర్లు 'నియర్ మి' సెర్చ్ పెరిగినట్లు తెలిపారు. హైపర్ లోకల్ మార్కెట్‌ను రూపొందించడం ద్వారా కస్టమర్లు వేగంగా గుర్తించడంలో, సమీప డీలర్లను కనెక్ట్ కావడంలో సహాయపడుతుందన్నారు. ఈ డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ జర్నీలో గత రెండేళ్లలో 3000 ఆన్‌లైన్ టచ్ పాయింట్స్‌లో 1,000 మంది డీలర్‌షిప్స్‌ను ఏకీకృతం చేశామన్నారు.

డిజిటల్ విచారణ అప్
మారుతీ సుజుకీ డిజిటల్ విచారణలు ఐదు రెట్లు పెరిగాయని, మొత్తం అమ్మకాల్లో 20 శాతం ఉన్నాయని కంపెనీ తెలిపింది. డిజిటల్ ట్రాన్సుఫార్మేషన్ సంతృప్తికరంగా ఉన్నట్లు చెప్పారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత 5 నెలల కాలంలో డిజిటల్ విచారణలు 33 శాతానికి చేరుకున్నట్లు తెలిపారు.