ఎల్లుండి నుండే... హైదరాబాద్‌వాసులకు ఇండేన్ గ్యాస్ గుడ్‌న్యూస్: కానీ వీరికే
హైదరాబాద్ నగర ప్రజలకు గుడ్‌న్యూస్! ఇక నుండి బుక్ చేసుకున్న చేసిన కొద్ది గంటల్లోనే గ్యాస్ సిలిండర్ ఇంటికి డెలివరీ కానుంది. ఈ నెల 16వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో ప్రారంభించనుంది ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్(IOC). అయితే ఒక్క సిలిండర్ ఉన్న కస్టమర్లకే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
అంతేకాదు, వేగవంతమైన డెలివరీకి రూ.25 అదనంగా తీసుకుంటారు. దీంతో సామాన్యులకు వంట గ్యాస్ సిలిండర్ కష్టాలు తీరుతాయి. సులభతర జీవనం విధానం కింద తెలంగాణలో ప్రయోగాత్మకంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలు చేయనున్నారు. ఈ నెల 16న ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు ఐవోసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

హైదరాబాద్ తర్వాత ఇతర ప్రాంతాలకు
సిలిండర్ బుక్ చేసిన గంట, రెండు గంటల్లోనే కస్టమర్లకు అందించే తత్కాల్ సర్వీసులను ఫిబ్రవరి 1వ తేదీ నుండి ప్రారంభించాలని కేంద్రం తొలుత భావించింది. అయితే దీనిని కాస్త ముందుకు జరిపారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో దీనిని జనవరి 16 నుండి అమలు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. పండుగ నేపథ్యంలో శనివారం నుండి అమలు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో అమలు చేసిన తర్వాత గుర్తించిన అంశాల ఆధారంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నారు.

ఇవి గుర్తుంచుకోండి...
- ఈ నెల 16వ తేదీ నుండి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రారంభిస్తారు.
- వర్కింగ్ డేస్‌లో ఉదయం గం.8 నుండి మధ్యాహ్నం గం.2 వరకు ఈ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ నిర్ణీత సమయంలో బుక్ చేసుకుంటే తత్కాల్ కింద రెండు గంటల వ్యవధిలో డెలివరీ చేసేందుకు డీలర్లను ఐవోసీ సమాయత్తం చేస్తోంది.
- అధికారులు ఇందు కోసం ప్రత్యేక యాప్ సిద్ధం చేస్తోంది.
- రిసిప్ట్ అవవసరం లేదు. కేవలం ఆన్ లైన్ ద్వారానే వెసులుబాటు ఉంది.
- తత్కాల్ సేవల కింద రూ.25 అదనం. ఎంత మొత్తం చెల్లించాలన్నది కస్టమర్‌కు సమాచారం అందుతుంది.

తత్కాల్ డెలివరీ
గ్యాస్ బుకింగ్ చేసుకున్న మొదటి రోజే వంట గ్యాస్ డెలివరీ చేసే విధంగా సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైన IOC... ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ఒక నగరం లేదా జిల్లాను తత్కాల్ ఎల్పీజీ సేవల ప్రారంభానికి గుర్తిస్తోంది. ఈ తత్కాల్ పథకం సేవల క్రింద బుక్ చేసుకున్న అరగంట లేదా నలభై ఐదు నిమిషాల్లో కస్టమర్‌కు గ్యాస్ డెలివరీ చేయనున్నట్లు ఐవోసీ అధికారులు ఇటీవల తెలిపారు. ఇండేన్ బ్రాండ్ ద్వారా ఐవోసీ వంట గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తోంది. మొత్తం 28 కోట్ల డొమెస్టిక్ ఎల్పీజీ కన్స్యూమర్లలో ఇండేన్ గ్యాస్ 14 కోట్ల మంది కస్టమర్లకు సేవలు అందిస్తోంది. 2010లోను నాటి మంత్రి ఎల్పీజీ డెలివరీ స్కీంను ప్రారంభించారు. ఈ స్కీం ప్రకారం కస్టమర్ గ్యాస్ సిలిండర్‌ను ఉదయం 7 నుండి రాత్రి 9 వరకు సప్లై చేసేలా డిమాండ్ చేయవచ్చు.